అమరావతి, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు- చేస్తోంది. ధాన్యం సేకరణలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలనే సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయగా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్‌లో పండిన 37 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించనుంది. క్వింటా ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ 2,060, సాధారణ రకానికి రూ 2,040 గా నిర్ణయించారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ మద్దతు ధరలతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వం రూ 100 పెంపుదల చేసింది. రవాణా, కూలీ, గోనె సంచులను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. గోనె సంచులను రైతులు తెచ్చుకుంటే మద్దతు ధర కన్నా అధికంగా క్వింటాకు రూ 12.66 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొంతంగా రవాణా ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 1000కు పైగా ఉన్న రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) 3423 క్లస్టర్లుగా విభజించి వాటి పరిధిలో ఆయా ప్రాంతాల్లో పండిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఆ ప్రాంతాల్లో వచ్చిన ధాన్యం దిగుబడిని దృష్టిలో ఉంచకుని రెండు లేదా మూడు ఆర్బీకేలను ఒక క్లస్టర్ గా విభజించారు. రెండువేల టన్నుల కన్నా ఎక్కువ సేకరణ ఉండే క్లస్టర్లను ఏ కేటగిరీగా, 1000 నుంచి 2000 టన్నుల సేకరణ ఉండే క్లస్టర్లను బీ కేటగిరిగా, 1000 టన్నుల లోపు ఉండే క్లస్టర్లను సి కేటగిరిగా విభజించారు. ఈ క్లస్టర్లనే ప్రభుత్వం అధికారికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించింది. ధాన్యం కొనుగోలుకు ఈ-క్రాప్ తప్పనిసరి. వెబ్ ల్యాండ్, కౌలు రైతులకు అందించే పంట సాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ) ప్రాతిపదికగా 100 శాతం ఈ-క్రాప్ నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. ఈ-క్రాప్ నమోదు ఏ స్థాయిలో ఉందో, ప్రత్యేకించి వరి పండించిన కౌలు రైతుల పేర్ల నమోదు ఎంతవరకు సవ్యంగా ఉందో తెలియాలంటే ధాన్యం సేకరణ ప్రక్రియ దాకా ఆగాల్సిందే. అధికారులు మాత్రం ఆర్బీకేల పరిధిలో ఈ-క్రాప్ జాబితాలను ప్రదర్శిస్తున్నామనీ, ఎవరికైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే తెలియచేయాలని కోరుతున్నారు.
21 రోజుల్లో నగదు జమ
ధాన్యం కొనుగోలు చేసిన తరువాత రైతులకు 21 రోజుల్లోపు నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాదీ ఇలాగే చెబుతున్నా ధాన్యం నగదు జమ ఆలస్యమవుతూ ఉండటం.. రైతులు ఆందోళన వ్యక్తం చేయటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఆలస్యానికి ఏ మాత్రం అవకాశం లేకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు సహకారం అందించేందుకు ఈ ఏడాది కొత్తగా 10300 మంది వాలంటీర్ల సేవలను ప్రభుత్వం ఉపయోగించకుంటుంది. ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగినంతకాలం వారికి రూ.1500 అదనంతా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు వాలంటీర్లు సహాయకారులుగా ఉండటంతో పాటు ధాన్యం సేకరణలోని ప్రతి ప్రక్రియను ఫొటో తీసి అప్‌లోడ్ చేసే బాధ్యతలను వాలంటీర్లు నిర్వహించనున్నారు. సేకరించే బియ్యాన్ని ఏ మిల్లుకు తరలిస్తున్నారనే విషయాన్ని ముందుగా తెలియకుండా గోప్యత పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని మిల్లులను ఆ ప్రాంతంలోని ఆర్బీకేలతో అనుసంధానం చేస్తూ మ్యాపింగ్ చేయనున్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయి లోడింగ్ అయిన తరువాతే ఏ మిల్లుకు తరలించాలో తెలియచేసే ఆటోమేటిక్ సాప్ట్ వేర్ ను కూడా రూపొందించారు. దీని వల్ల మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం తూకం, తరుగు, తేమ శాతం తదితర విషయాల్లో వచ్చే సమస్యలను ఎప్పటికపుడు పర్యవేక్షించాలని కస్టోడియన్ అధికారులను కూడా నియమిస్తున్నట్టు- ప్రభుత్వం ప్రకటించింది.