న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అఖిల భారత సర్వీస్ రూల్స్ ప్రకారం ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రెండేళ్ల కాలపరిమితి ముగిసిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన సీనియర్ ఐపీఎస్, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ వెంకటేశ్వరరావు స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్ఎ)పై జస్టిస్ ఎ.ఎం. ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సస్పెన్షన్ ఎంత కాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని సూచించింది. వెంకటేశ్వరరావుపై క్రిమినల్ ప్రోసిడింగ్స్ ఉన్నాయని, సస్పెన్షన్ కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రెండేళ్ల తర్వాత నిర్దేశాలు అడుగుతారా అని ప్రశ్నించింది. రెండేళ్ల తర్వాత కూడా సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపించాలని ఆదేశించింది.
కాలపరిమితి ముగిసిన తర్వాత చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేమని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్‌పై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రేపటిలోగా(శుక్రవారం) అన్ని వివరాలలు అందజేయాలని, ఆ తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై పూర్తి విచారణ అనంతరం ధర్మాసనం నేడు తుది ఆదేశాలు ఇవ్వనుంది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ వైఎస్సార్పీపీ ఫిర్యాదు చేయడంతో ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం తప్పించిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..