Friday, November 22, 2024

AP | స్ట్రాటజీ మారింది.. దూకుడు పెంచిన టీడీపీ, గణాంకాలతో ప్రజల్లోకి

అమరావతి, ఆంధ్రప్రభ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్టైల్‌ను, స్ట్రాటజీని పూర్తిగా మార్చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన వ్యూహాలకు పదునుపెడుతూ, దూకుడును ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా పాలకపక్షం వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా తన వ్యూహాలను కూడా మార్చుకుంటూ చంద్రబాబు పాలకపక్షంపై విరుచుకుపడుతున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లు చేస్తూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు వరుస ప్రెస్‌మీట్లు, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లతో అధికార వైసీపీపై దాడి మొదలు పెట్టారు. గడిచిన మూడు రోజులుగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్‌ల పరిస్థితిపై వరుసగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను చేస్తూ సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాజెక్ట్‌ల అంశంపై దృష్టి పెట్టిన ఆయన గ ణాంకాలతో సహా వాటి పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో సాగునీటి రంగానికి చేసిన కేటాయింపులు, ఖర్చు ఆనాడు ప్రాజెక్ట్‌ల పరిస్థితిని స్పష్టంగా వివరిస్తున్నారు.

- Advertisement -

ఇదే సమయంలో గడిచిన నాలుగేళ్లుగా అధికార పక్షం సాగునీటి రంగానికి చేసిన కేటాయింపులు, ఖర్చు వివరాలను పూర్తి గణాంకాలతో విశ్లేషిస్తూ దాడిని మొదలుపెట్టారు. పోలవరం నుంచి రాయలసీమలో తమ హయాంలో ప్రాజెక్ట్‌ నిర్మాణం, సాధించిన పురోగతి వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లతో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. తన వాదనకు బలం చేకూరేలా గతం నుంచి ఇప్పటి వరకు జారీ చేసిన జీవోలు, ఇతర ఉత్తర్వులు, ఆనాటి, ప్రస్తుత పరిస్థితుల ఫోటోలు, వీడియోలతో సహా ప్రదర్శిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే త్వరలోనే మరికొన్ని రంగాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఉదాహరణతో సహా బయటపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగం, మద్యం, ఇతర అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్ల ద్వారా బయటపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, ఇతర పెట్టుబడులు ప్రస్తుతం అవి ఏ పరిస్థితిలో ఉన్నాయోనన్న వివరాలను ఇప్పటికే ప్రెస్‌మీట్ల ద్వారా వెల్లడించిన చంద్రబాబు ఇప్పుడు తాజాగా తన వ్యూహాన్ని మార్చి ఈ వివరాలన్నీ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లతో యువత, ప్రజలకు వివరించి తద్వారా వారిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

ప్రతి సమాచారాన్ని అన్ని ఆధారాలతో సహా నిరూపించి తద్వారా పార్టీకి మైలేజ్‌ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు అధికార వైసీపీ కూడా టీడీపీ అధినేత, ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలపై ధీటుగా స్పందిస్తూ ఫ్యాక్ట్‌ చెక్‌ రూపంలో కౌంటర్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తమ వాదనకు మరింత పదును పెట్టి పూర్తి నివేదికలు, వాస్తవాలతో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లను మరిన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లు అన్నీ పార్టీ యంత్రాంగం ద్వారా సోషల్‌ మీడియాలో ఉంచి తద్వారా మైలేజ్‌ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రతి అంశాన్ని నిర్థిష్టమైన అంశాలతో బలంగా ప్రజల్లోకి తీసుకువె ళ్లే విధంగా తన స్ట్రాటజీకి చంద్రబాబు పదును పె డుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement