అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3 వేల కోట్లు- మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణం తీసుకుంది. రూ. వెయ్యి కోట్లు పది సంవత్సరాలకు 7.45 శాతం వడ్డీ.. మరో రూ. వెయ్యి కోట్లు 17 సంవత్సరాలకు 7.45 శాతం వడ్డీ.. ఇంకో రూ. వెయ్యి కోట్లు 20 ఏళ్లకు 7.44 శాతం వడ్డీతో అప్పు చేసింది. ఎఫ్ఆర్బీఎం కింద 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఇచ్చిన రూ.30 వేల 500 కోట్ల రుణం నాలుగు నెలల్లోనే పూర్తి అయింది.
వంద రోజుల్లో బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ.30 వేల 500 కోట్ల అప్పు తీసుకుంది. మంగళవారం తెచ్చిన అప్పులో రూ.2 వేల కోట్లు తాజాగా కేంద్రం ఇచ్చిన అదనపు రుణ పరిమితి.. ఈ డబ్బుతో సామాజిక భద్రతా పెన్షన్లు 60 శాతం వరకూ బుధవారం పంపిణీ చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు మరో రూ. 5 వేల 500 కోట్ల రూపాయలు అవసరముంది.