Thursday, September 19, 2024

AP | వచ్చే ఏడాది మారనున్న స్కూల్‌ డ్రెస్‌ !

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల స్కూల్‌ యూనిఫాం వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారనుంది. ఈ మేరకు ఏకరూప దుస్తుల రంగును వచ్చే విద్యా సంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు బ్యాగ్‌ల నాణ్యతను పెంచాలని ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుతం విద్యార్ధులకు పంపిణీ చేసిన బ్యాగ్‌లలో నాణ్యత లోపించడంతో ఎక్కువ పుస్తకాలు పెడితే ఆ బరువుకు హ్యాండిల్‌ తెగిపోతోందని విద్యార్ధులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో ఈసారి బ్యాగుల నాణ్యత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

అక్టోబరు మొదటి వారంలో టెండర్లు నిర్వహించి, జూన్‌ 12 నాటికి కిట్లు అందించేలా సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం అనుమతి కోసం పంపించింది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో కొంత మంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.

మార్కెట్‌లో ఉన్న ధరలకంటే అధిక ధరలకు పాఠ్యపుస్తకాల ముద్రణను అప్పగించి సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే విద్యార్ధులకు అందించిన స్టూడెంట్స్‌ కిట్స్‌లో పార్టీ రంగులు పులిమి పార్టీ ప్రచారానికి అనువుగా మార్చుకున్నారన్న విమర్శలున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికే అధికారులు హడావిడిగా ఈ విద్యా సంవత్సరానికి సబంధించిన స్టూడెంట్‌ కిట్స్‌ను గత ప్రభుత్వంలోని వైసీపీ రంగులతో హడావిడిగా సిద్ధం చేసి ఉంచారు. దీంతో చేసేది లేక కూటమి ప్రభుత్వం వాటిని యధావిధిగా విద్యార్ధులకు పంపిణీ చేశారు.

- Advertisement -

వచ్చే యేడాది నుంచి వీటిని సమూలంగా రూపుమాపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, విద్యార్ధులకు పంపిణీ చేస్తున్న షూ, బ్యాగులు, బెల్టు తదితరాలలో నాణ్యతపై తీవ్రంగా ప్రతిఘటించింది.

ఇపుడు వీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్ధులకు పంపిణీ చేసే కిట్‌లలో నాణ్యతపై రాజీపడొద్దని ఆదేశాలు జారీ చేసింది. టెండర్లను కూడా పారదర్శకంగా జరపాలని ఆదేశించింది. అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement