విజయనగరం, ప్రభన్యూస్ : కోట్లాది రూపాయిలు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేసి మరపట్టించేందుకు రైస్ మిల్లులకు చేరవేస్తున్న క్రమంలో ప్రభుత్వం ఎప్పటిలాగానే రైతులచే వేలెత్తి చూపించుకోవడం అనివార్యమైంది. కస్టమ్ మిల్లింగ్ రైస్(సిఎంఆర్) విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రకరకాల ప్రక్రియలు అనుసరింపజేసిన ప్రభుత్వం మిల్లర్ల దోపిడీని మాత్రం ఏ దశలోనూ నిలువరించలేకపోయిందన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లంటూ ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం 10 శాతం మేర కూడా విజయవంతం కాలేకపోయిందని క్షేత్ర స్థాయి పరిస్థితులు చాటిచెప్పిన వైనం తెలిసిందే. ఆనేపథ్యమే.. ఎప్పుడూ అదే తంతు… ఈసారి ఆర్బీకేల వంతు.. అంటూ చర్చించుకునేందుకు ఆస్కారమిచ్చింది. ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయిలు వెచ్చిస్తున్నది ఎవరి సౌలభ్యం కోసమో అర్ధం కాక అటు రైతులు.. ఇటు చిన్నచిన్న మిల్లుల యజమానులు వాపోతున్న వైనం కూడా ఇదే చాటిచెబుతోంది.
ధాన్యం కొనుగోళ్ల అంశంలో జిల్లా అధికార యంత్రాంగం మోతుబరులైన మిల్లర్లకు సహకరిస్తూ అటు రైతులకు, ఇటు చిత్తశుద్ధితో రూ.లక్షల్లో విద్యుత్తు బిల్లులు చెల్లించి మిల్లులు నడుపుతున్న వారికి తీవ్ర అన్యాయం చేస్తోందన్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి కూడా. గంట్యాడ మండలంలో ఒక మిల్లరు అయితే కనీసం రూ.వేలల్లో కూడా విద్యుత్తు బిల్లు చెల్లించకుండా రూ.కోట్ల విలువైన సిఎంఆర్ పౌర సరఫరాల గోదాములకు తరలించేస్తోంటే సాటి మిల్లర్లే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. అబ్రకదబ్ర మేజిక్ కాకపోతే మరేంటి? అంటూ పరస్పరం చర్చించుకుంటున్నారు చిన్నచిన్న మిల్లుల యాజమాన్యాలు. నాలుగైదు ఏసీకేలు వేసే మిల్లర్లు తక్కువలో తక్కువ రూ.2 లక్షలు విద్యుత్తు బిల్లులు చెల్లిస్తుండగా ప్రభుత్వం కొనిచ్చిన ధాన్యాన్ని తూర్పుగోదావరికి అమ్మేయడమే కాకుండా పీడీఎస్ బియ్యాన్నే పాలిష్ చేసేసి ఇప్పటికే 40 ఏసీకేలు వేసేసిన ఓ ప్రబుద్ధుడు రూ.40 వేలైనా విద్యుత్తు బిల్లు చెల్లిస్తున్నాడా? లేదా? అన్నది ఎవ్వరికీ అంతుపట్టని పరిస్థితి. జిల్లా అధికార యంత్రాంగం గానీ విద్యుత్తు శాఖ అధికారులు గానీ ఎందుకు నిద్ర నటిస్తున్నారన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ విషయంలో నాణ్యతా పరిశీలకులదే హవా అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు పంపిణీ అయిన బియ్యాన్నే మళ్లి గోదాముల్లో స్వీకరించేస్తున్నారంటే వారి పనితనం ఏంటన్నది అవగతమవుతుంది.
కొంత మంది మోతుబరులైన మిల్లర్లు తమ మైండ్ గేమ్‌తో రైతులకు ఇబ్బందులు సృష్టంచి అధికార యంత్రాంగాన్ని ఇరకాటంలోకి నెట్టాలన్న యోచనలో వున్నట్లు పరిస్థితులు చాటిచెబుతున్నాయి. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరగకుండా గతంలో మాదిరిగానే దోపిడీకి అనువుగా పరిస్థితులను సృష్టిస్తున్నారన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. క్వింటాలుకు 115 కిలోలు వారి హక్కుగా కొంత మంది మిల్లర్లు దోచుకుంటున్న పరిస్థితి. మరోవైపు ధాన్యం నూర్పులు వేసి రైతులు కాపలా ఉండవలసిన పరిస్థితి కూడా అనివార్యమైంది కొన్ని ప్రాంతాల్లో. వరిపంట బాగా పండినప్పటికీ ఒక వైపు ప్రకృతి, మరోవైపు ప్రభుత్వ అచేతనత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నది రైతుల నోట వినిపిస్తున్న మాట. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం వుండడం, అధికార యంత్రాంగం కొసరు లక్ష్యంతో ముందుకేగుతుండడం.. వెరసి అన్నదాతకు అవస్థలు తప్పని నేపథ్యం. దళారీ వ్యవస్ధను రూపుమాపడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఆమేరకు కొనుగోలు చేయలేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు, అవస్ధలుపడుతున్నారు. తప్పనిపరిస్థితిలో డబ్బులు తక్కువ అయినా దళారులకు ధాన ్యం విక్రయించడం రైతులకు తప్పడం లేదు. ఏదో రకంగా పండించిన ధాన్యం అమ్మకాలు జరిగితే తమ ఇబ్బందులు తొలగిపోతాయని రైతులు భావిస్తున్నారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..