Tuesday, October 22, 2024

AP | పోలీసు అమరవీరుల త్యాగం అజరామరం.. ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతిలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

  • అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించిన ఎస్పీ సుబ్బరాయుడు
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్
  • జిల్లాలో అమరులైన 8 మంది పోలీసుల కుటుంబ సభ్యులకు సన్మానం
    తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఎస్పీ సుబ్బరాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… విధినిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన వారిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో పోలీసులు దేశంలో 21-10-2023 నుంచి 20-10-2024 నాటికి 216 మంది, మన జిల్లాలో విధి నిర్వహణలో 08 మంది పోలీసు సిబ్బంది అశువులు బాశారన్నారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న పోలీసుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. విధుల నిర్వహణలో ఎన్నో కష్ట నష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని సేవ చేస్తున్న పోలీస్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ… ప్రపంచమంతటా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం ఎండా, వాన, పగలు, రాత్రి అని తేడా లేకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. కుటుంబంతో జరుపుకునే పండుగకు కూడా అందుబాటులో లేకుండా.. ప్రజల కోసం జీవించి ప్రాణాలను ఫణంగా పెట్టి మరణిస్తున్న పోలీసుల త్యాగాన్ని గుర్తించి, మనం ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అనంతరం అదనపు ఎస్పీ వెంకట్రావు దేశవ్యాప్తంగా అమరులైన 216 మంది పోలీసుల పేర్లను చదివి వినిపించారు. అమర వీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.

అనంతరం జిల్లాలో అమరులైన పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్సై రెడ్డి నాయక్, ఏఎస్ఐ యువరాజులు నాయుడు, హెడ్ కానిస్టేబుళ్లు చలపతిరాజు, ఇలియాస్, శ్రీధర్ బాబు, నాగరాజ, కానిస్టేబుళ్లు విద్యా సాగర్, అనిల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను కలెక్టర్, ఎస్పీ పరామర్శించి, ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఎస్పీ సుబ్బరాయుడు భరోసానిచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహర చారి, తిరుమల ఏఎస్ పిరామకృష్ణ, సాయుధ దళం ఏఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు గిరిధర, వెంకటనారాయణ, ప్రసాద్, రామక్రిష్ణాచారి, రవీంద్రారెడ్డి, రమణయ్య, చిరంజీవి, జిల్లాలోని సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, పదవి విరమణ పొందిన పోలీసు అధికారులు పాల్గొని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement