శ్రీశైలం డ్యాంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఏపి, తెలంగాణ ఇరు రాష్ట్రాలు గత కొన్నిరోజులుగా విద్యుత్ ఉత్పాదన చేసేందుకు జలాశయంలోని నీటిని పోటాపోటీగా వినియోగించడంతో జలాశయం డెడ్ స్టోరేజ్‌కు చేరువలో ఉంది. వాస్తవంగా శ్రీశైల జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు. అయితే ప్రస్తుతం జలాశయం 809.70 అడుగులుగా ఉంది. ఇక 215 టిఎంసిల సామర్థ్యానికి గాను 34.1482 టిఎంసిలకు నీటి నిల్వలు పడిపోయాయి. వచ్చేది వేసవి కాలం కావడంతో ఇరు రాష్ట్రాలకు నీటి ఇక్కట్లు తప్పేలా లేవు. వాస్తవంగా శ్రీశైల జలాశయం నీటిని సాగు, తాగు నీటి అవసరాల కోసమే విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఐదు నెలల క్రితమే కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. ఆ సమయంలో శ్రీశైలంలో 852 అడుగులుగా నీటి నిల్వలున్నాయి. అయితే ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి చేయడంతో గురువారం సాయంత్రానికి జలాశయంలో నీటి నిల్వలు 34 టిఎంసిలకు పడిపోయాయి. ఈ వాటర్ ఇయర్‌లో ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగా, జలాశయం ఖాళీ అవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. వాస్తవంగా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ 790 అడుగులు, అయితే ప్రస్తుతం 809 అడుగులుగా ఉంది. అంటే పూర్తిస్ధాయి డెడ్ స్టోరేజ్‌కు 19 అడుగుల దూరంలో ఉంది. కాగా ప్రస్తుతం శ్రీశైల జలాశయం నుంచి ఇటు ఏపి, అటు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి సరఫరాను ప్రస్తుతం పూర్తిగా నిలిపివేశారు. అయితే ఏపి కుడి విద్యుత్ కేంద్రంలో మాత్రం విద్యుత్ ఉత్పాధన నిమిత్తం 8288 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.
తాగునీటికి ఇబ్బంది లేదు : ఇరిగేషన్ అధికారులు..
శ్రీశైల జలాశయం డెడ్ స్టోరేజ్‌కు చేరుకున్నప్పటికి వచ్చే వేసవిలో మంచినీటికి ఇబ్బంది లేదంటున్నారు ఇరిగేషన్ ఇంజనీర్లు, వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని వివిధ ప్రాజెక్టులలో నీటి నిల్వలు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో తెలుగుగంగాలో 16 టిఎంసిల నీటి నిల్వలకు గాను ప్రస్తుతం 3 టిఎంసిల నీటినిల్వలు ఉన్నాయి. ఇక అవుకు రిజర్వాయర్‌లో 4 టిఎంసిలు, గోరుకల్లులో 12.96 టిఎంసిల గాను 8 టిఎంసిలు, హంద్రీనీవా పరిదిలోని కృష్ణగిరిలో 0.15 టిఎంసిలు, పందికొనలో 0.44 టిఎంసిలు, గాజులదిన్నేలో 2.6 టిఎంసిలు, సుంకేసులలో ఒక టిఎంసి నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక తుంగభ ద్ర జలాశయంలో కేసి నీటి కోటా కింద 3. 5 టిఎంసి నీటి నిల్వలు ఉన్నాయి. ఇందులో ఒక్క జిడిపి మినహా మిగతా వాటికింద రబీకి నీటి విడుదల అవకాశం లేదు. కావున ఆయా ప్రాజెక్టులలో ఉన్న నీటిని వేసవిలో మే చివరి వరకు తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు ఏపి 1300 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి..
ఈ ప్లడ్ సీజన్‌లో జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఏపి 26.14 లక్షల క్యూసెక్కుల నీళ్లను వాడుకొని 1300 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ 42.89 లక్షల క్యూసెక్కుల నీటితో 1980 ఎంయూల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. మొత్తంగా కరెంటు ఉత్పత్తి కోసం తెలంగాణ 370.94 టిఎంసిల నీటిని వాడితే ఏపి 225.21 టిఎంసీల నీటిని వాడుకున్నట్లు తెలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..