తిరుమల, ప్రభన్యూస్ : తిరుమల శ్రీవారి దర్శనార్ధం విచ్చేసే సామాన్య భక్తులు బసచేసే రూ.50, రూ.100 అద్దె గదులను రూ.120 కోట్లతో అధునీకరించామని, వీటి అద్దె ఏమాత్రం పెంచలేదని టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి స్పష్టం చేశారు. విఐపిల కోసం కేటాయించే గదుల్లో అద్దె వ్యత్యాసం లేకుండా చేసేందుకే నారాయణగిరి, ఎస్వీఆర్‌హెచ్, స్పెషల్ టైప్ విశ్రాంతి గృహాలను అధునీకరించి తగిన అద్దె నిర్ణయించామని తెలియజేశారు. అయితే సామాన్య భక్తుల పై అధిక భారం మోపారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న దుష్పృచారాన్ని భక్తులు నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈవో మాట్లాడుతూ, తిరుమలలో మొత్తం 7500 గదులు ఉన్నాయని, వీటిలో సామాన్య భక్తుల కోసం రూ.50, 100 అద్దె గదులు సుమారు 5 వేల వరకు ఉన్నాయని, ఇటీవల ఈ గదుల్లో గీజర్, ఫర్నీచర్, ఫ్లోరింగ్ తదితర అధునీకరణ పనులు చేపట్టామని తెలిపారు.
వీటిని భక్తులకు అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని, ఇందుకోసం విద్యుత్ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులకుగాను రోజుకు రూ. 250 వ్యయం అవుతోందని చెప్పారు. కాగా సామాన్య భక్తుల కోసం రూ.100 కోట్లతో పిఏసి-5 నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక విఐపిలకు కేటాయించే నారాయణగిరి 1,2,3,4 విశ్రాంతి గృహాలు, ఎస్విఆర్‌హెచ్, స్పెషల్ టైప్, వివిఆర్‌హెచ్ విశ్రాంతి గృహాల్లోని మొత్తం 170 గదులను గీజర్, ఏసి ఉడెన్ కాట్, దివాన్ తదితర వసతులతో రూ.8 కోట్లతో అధునీకరించినట్లు చెప్పారు.
ఆగమశాస్త్రం ప్రకారమే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
వైష్ణవాలయాల్లో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించవచ్చని దేశ వ్యాప్తంగా ఉన్న 32 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు తెలియజేశారని, తద్వారా ఎక్కువ మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగలిగారని తెలిపారు. అయితే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి కమర్షియల్ చేశారని టిటిడి మాజి చైర్మెన్ ఆరోపించడం భావ్యం కాదన్నారు. అవసరమైతే మఠాధిపతులతో పాటు పండితులు కమిటి సమర్పించిన నివేధికను కూడా వారికి పంపుతామని చెప్పారు. ఈ సమావేశంలో జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహ కిషోర్, ఎస్విబిసి సిఈవో షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2 జగదీశ్వర్‌రెడ్డి, రిసెప్షన్ డిప్యూటిఈవోలు హరీంద్రనాథ్, భాస్కర్‌లు పాల్గొన్నారు. అనంతరం అధునీకరించిన గదులను మీడియాకు చూపించి ఆ గదుల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాల పై వివరించారు.