Friday, November 22, 2024

వైఎస్‌ వివేకా హత్య కేసులో అసలు దోషులకు శిక్ష పడేలా చూడాలి: పరిటాల సునీత

అనంతపురం రూరల్‌, ప్రభ న్యూస్‌: సొంత బాబాయ్‌ని హత్య చేస్తే దానిని రాజకీయంగా వాడుకున్న చరిత్ర సీఎం జగన్‌దని మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు. నగరంలోని తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పులివెందులలో, అందునా వైఎస్‌ కోటలో వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసే ధైర్యం బయట వ్యక్తులకు ఎలా వస్తుందని వారు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి చెబుతున్నట్టుగానే.. ఇప్పుడు అసలు దోషులు ఎవరో తెలిసిపోయిందన్నారు. వివేకా హత్యలో అన్ని వేళ్లూ అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి వైపే చూపిస్తున్నాయని.. ఇప్పటి-కై-నా నిజాలు ఒప్పుకోవాలని సూచించారు. నేరస్తులను కాపాడేందుకు సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయని దీనిపై జగన్‌ సమాధానం చెప్పి తీరాలన్నారు. వివేకా కూతురు సునీత ధైర్యంగా నిలబడటం వల్ల ఈ కేసు ఇంకా నడుస్తోందన్నారు.

గతంలో ఈ హత్యకు టీడీపీతో సంబంధం ఉందని చెప్పిన సీఎం జగన్‌, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారన్నారు. సీబీఐ విచారణ కోరిన జగన్‌.. హైకోర్టులో పిటిషన్‌ ఎందుకు వెనక్కి తీసుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వివేకా హత్యకు కుటు-ంబ సభ్యులే కారణమన్న విషయం జగన్‌కు ముందే తెలిసినప్పటికీ.. తమ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేశారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిజాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంటే.. సీబీఐపై ఎదురు దాడి చేస్తున్నారని కామెంట్‌ చేశారు. సీబీఐ అధికారి పై రాష్ట్ర పోలీసులతో కేసు పెట్టించిన చరిత్ర ఎక్కడా చూడలేదని శ్రీరామ్‌ అన్నారు. ఈ కేసులో అసలు సూత్రదారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకైనా రక్షణ ఉందా… అనే అనుమానం కలగమానదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement