Tuesday, November 19, 2024

హడలెత్తిస్తున్న మాండూస్‌, పోటెత్తుతున్న అలలు.. తీర ప్రాంత జిల్లాల్లో భయం భయం

అమరావతి, ఆంధ్రప్రభ: మాండూస్‌ తుపాన్‌ హడలెత్తిస్తోంది. ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్‌ తీవ్ర తుపాన్‌ మాండూస్‌ తుఫానుగా బలహీనపడింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. పలుప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో కారుచీకట్లు కమ్మేశాయి. తుఫాన్‌ ప్రభావిత జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం మధ్యహ్నం నుంచి పాఠశాలలకు సెలవలు ప్రకటించారు. మాండూస్‌ ప్రభావంతో నెల్లూరు జిల్లా తడిసిముద్దవుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కలెక్టర్‌ చక్రధర్‌బాబు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టర్‌రేట్‌తో పాటు అన్ని మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

తూర్పుగోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతం అయింది. ఓడలరేవు, అంతర్వేది, కాట్రేనికోన ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లాలో మాండూస్‌ ఎఫెక్ట్‌ కారణంగా ఉప్పాడ తీరం కల్లోలంగా మారింది. కాకినాడ – ఉప్పాడ బీచ్‌ రోడ్డుపై అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం పదిమీటర్ల మేర ముందుకు వచ్చింది.

- Advertisement -

తిరుపతి జిల్లాను మాండూస్‌ తుఫాన్‌ హడలెత్తిస్తోంది. జోరు వానకు తీవ్రమైన చలిగాలి తోడవ్వడంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఈదురుగాలుల దాటికి చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల పంటనష్టం సంభవించింది. రేణిగుంట రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో వర్షపునీరు నిల్చింది. వాకాడు, కోట మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్‌ ప్రభావం కారణంగా వాకాడులో 40 మీటర్లు, కోటలో 20 మీటర్ల మేర సముద్రం ముందుకువచ్చింది. ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తీర గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సూళ్ళూరుపేట నియోజక వర్గం తడకుప్పంలో తీరప్రాంతంలో నివాసముంటున్న జాలర్ల కుటుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బి.ఎన్‌ కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు, తడ, సూళ్ళూరుపేట మండలాల్లో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి.

అప్రమత్తం

తుపాన్‌ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్‌ కదలికల్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నారు. మత్యకారుల్ని వేటకు వెళ్ళొద్దని సూచించారు. ప్రభావం చూపే జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారుల అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యలకోసం ప్రకాశం-2, నెల్లూరు-3, తిరుపతి-2, చిత్తూరు-2 మొత్తం 5ఎన్డీఆర్‌ఎఫ్‌, 4ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. కామన్‌ అలర్ట్‌ ప్రోటోకాల్‌, ఏపీ అలర్ట్‌ ద్వారా ఆరు జిల్లాల్లోని సుమారు కోటిమందికి సబ్‌ స్క్రైబర్లకి హెచ్చరిక సందేశాలు పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement