అమరావతి, ఆంధ్రప్రభ : పామాయిల్ రైతుల ఆనందం ఆవిరైంది. రెండు నెలల క్రితం వరకు మంచి రేటు వచ్చిందనే ఆనందంలో ఉన్న రైతులంతా ఒక్కసారిగా నీరుగారారు. ఆల్‌టైమ్ రికార్డులో నిలిచిన పామాయిల్ ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో కుదేలయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటీవల పామాయిల్ గెలల ధరను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయిల్‌పామ్ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా, రైతులెవ్వరూ ఊహించని రీతిలో పామాయిల్ గెలలకు నెలనెలా ధర పెరుగుతూ వస్తుండడంతో రైతులు ఎంతో ఆనందపడ్డారు. నవంబరు నుంచి పామాయిల్ గెలల ధరలో పెరుగుదల ప్రారంభమైంది. జనవరి నెలలో పామాయిల్ గెలలు టన్ను ధర రూ.17 వేలు మార్కును చేరు కోవడంతో రైతులు ఆనందించారు. ఆ తరువాత ఫిబ్రవరి నుంచి గణనీయంగా పెరుగుతూ మే నెలలో ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేస్తూ ఏకంగా రూ.23,365లకు చేరుకుంది. ఇది ఆయిల్‌పామ్ చరిత్రలో అత్యధికం. నెల రోజుల వ్యవధిలోనే ధరలు తగ్గి ప్రస్తుతం అది కాస్తా ఇప్పుడు రూ.16,911లకు చేరుకుంది.ఒక్కసారిగా ధరలు పతనం మే నెలలో పామాయిల్ ధరలు టన్ను రూ.23,365 ఉంటే జూలై నెలలో రూ.16,912లకు పడిపోయింది.
అంటే రెండు నెలల వ్యవధి లోనే ఒక టన్నుకు రూ.6,453 రైతులు కోల్పోయారు. అత్యధిక ధర పలకడంతో రైతులు పెట్టుబడులను అమాంతం పెంచేశారు. ఒకప్పుడు టన్ను లోడింగ్ చార్జీకి ఇప్పటి లోడింగ్ చార్జీలకు డబుల్ అయ్యాయి. ఒక్కో మనిషికి గెలలను నరికేందుకు రూ.1000 పై మాటే. ఇక కౌలు విషయానికొస్తే ఎకరం రూ.40 వేల నుంచి ప్రస్తుతం గరిష్టంగా రూ.1.15 లక్షల వరకు వెళ్లింది. గత రెండు నెలల క్రితం అయితే అసలు పామాయిల్ తోటల కోసం ఎంతో మంది రైతులు కాళ్లరిగేలా తిరిగినా కౌలుకు దొరకలేదంటే ఎంత డిమాండ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం పరిస్థితులు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు కౌలు రైతులంతా దిగాలు చెందుతున్నారు. పెరిగిన కౌలు ధరలతో పాటు కూలి, ట్రాన్స్‌పోర్ట్, ఇతరత్రా ఖర్చులు చూసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు పోగేసుకోక తప్పదని ఆవేదన చెందుతున్నారు. దీనికి తగ్గట్టు ప్రతీ నెల ధరల్లో వ్యత్యాసం, పక్క రాష్ట్రాల్రకు ఇక్కడకు తేడా ఉండం రైతులను మరింత క్షౌభకు గురిచేస్తోంది.
మిగిలిన పంటల సాగుకు పామాయిల్ సాగుకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఇతర పంటలైతే లాభదాయకంగా లేకపోతే ప్రత్యామ్నాయ పంట సాగుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనికి ఆ అవకాశం కూడా లేదు. మొక్క నాటి నుంచి 30 ఏళ్ల పాటు పామాయిల్ పంట పండించాల్సిందే. రాష్ట్రంలో 9 జిల్లాల్లో1.81 లక్షల హెక్టార్లలో 1.32 లక్షల మంది రైతులు ఆయిల్‌ఫామ్ సాగు చేస్తున్నారు.కేవలం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సుమారు 76,860 హెక్టార్లలో ఆయిల్‌ఫామ్ సాగు చేస్తున్నారు. ఎకరానికి 9, 10 టన్నుల దిగుబడి సాధిస్తే ప్రతీ ఏడాది 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది.