ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటన ఖరారు కావడంతో ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్‌లు ఏర్పాట్లపై పరిశీలించారు. పాతాళగంగ వద్ద సీప్లేన్ ల్యాండ్ కానున్న ప్రదేశం, రోప్ వే, ఆలయాన్ని వారు పరిశీలించారు.
పున్నమిఘాట్ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాటు చేయు భద్రతా ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఇతర అధికారులతో కలిసి పున్నమిఘాట్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయము చేసుకుంటూ పటిష్ట బందోబస్త్ నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు సలహాలను అందించడం జరిగింది.
ఈనెల 9న విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్‌ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీప్లేన్‌లో ప్రయాణించి శ్రీశైలం జలాశయం చేరుకొని రోప్ వే ద్వారా సీఎం చంద్రబాబు మల్లన్న ఆలయానికి చేరుకోనున్నారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు. వాస్తవంగా ప్రయోగాత్మకంగా రన్ చేయాలని మొదట అధికారులు భావించారు.
ఆ తర్వాత మిగతా వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ.. అనూహ్యంగా చంద్రబాబు సీ ప్లేన్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు సీ ప్లేన్ ప్రయాణంపై ఆసక్తి నెలకొంది. ఈనెల ఉదయం తన నివాసం నుంచి పున్నమి ఘాట్‌కు వచ్చి.. అక్కడ సీ ప్లేన్‌ను ప్రారంభించి.. దాంట్లోనే శ్రీశైలం వెళ్లనున్నారు.
ఈ నెల 9వ తేదీన పున్నమి ఘాట్‌లో విజయవాడ – శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. విజయవాడ- శ్రీశైలం- విజయవాడ మధ్య సీ ప్లేన్ నడిపేందుకు ఉన్న అవకాశాలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే.. రెగ్యులర్ సర్వీసు ప్రారంభించాలని భావిస్తున్నారు.
కృష్ణా నదిలో పున్నమి ఘాట్ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి పర్యాటక శాఖ అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక్కడి నుంచే సీ ప్లేన్ బయలుదేరి శ్రీశైలం వెళ్లనుంది. .శ్రీశైలం లోని పాతాళ గంగ బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న పాత జెట్టీపై దిగేందుకు అధికారులు త్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా సీ ప్లేన్ ప్రయోగం చేస్తున్నాయి.
బెజవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విజయవంతం అయ్యాక.. రెగ్యులర్ సర్వీసులు ప్రారంభిస్తే.. ఏపీ పర్యాటక రంగానికి మంచి బూస్ట్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల తరహాలో ఆధ్యాత్మికంగానూ, అటు పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేపట్టారు.