Monday, November 25, 2024

AP: వచ్చేవారం నుంచే కొత్త బార్‌ పాలసీ.. మూడేళ్ల పాటు చెల్లుబాటు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొత్త బార్‌ విధానం మరో వారం రోజుల్లో అమలులోకి రానున్నది. రాష్ట్ర ప్రభుత్వం బార్‌ పాలసీలో పలు మార్పులు తీసుకొచ్చింది. కొత్త పాలసీలో భాగంగా గత నెల 30, 31 తేదీల్లో ఆన్‌లైన్‌ ఈ-ఆక్షన్‌ విధానంలో 840 బార్లను కేటాయించారు. బార్లకు లైసెన్స్‌ మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. కొత్త పాలసీలో కేటాయించిన బార్లు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు ఉంటాయి. కొత్తగా కేటాయించిన బార్ల లైసెన్స్‌ ఫీజుల్లో ఏటా 10 శాతం పెంచనున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు దశల వారీ మద్య నిషేధం అమలులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్రంలో 4,384 మద్యం షాపులు ఉండగా కొత్త విధానంలో భాగంగా 2984కు కుదించారు. గతంలో ప్రైవేటు నిర్వహణలోని మద్యం షాపులను ఏపీబీసీఎల్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. నేరుగా మద్యం షాపుల్లో ఏపీబీసీఎల్‌ ద్వారా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో కొత్త బార్‌ పాలసీకి సైతం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి దశలో 20శాతం బార్లను తగ్గిస్తూ గతంలో నిర్ణయం తీసుకోగా పలువురు యజమానులు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లారు. లైసెన్స్‌ గడువు ముగియకుండానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ యజమానులు కోర్టు వెళ్లగా ఉత్తర్వులపై స్టే విధించారు.

ఈ క్రమంలో గత జూన్‌తో లైసెన్స్‌ గడువు ముగిసింది. గతంలో ఐదేళ్ల కాల పరిమితితో బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేయగా కొత్త విధానంలో మూడేళ్లకు కుదించారు. ఈమేరకు కొత్త పాలసీలో బార్లను కేటాయించారు. రాష్ట్రంలో 840 బార్లకు ప్రభుత్వం లైసెన్స్‌ల మంజూరుకు గత నెలలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, బార్ల సంఖ్య కుదింపుతో అనధికారిక మద్యం వలన ఉన్న దుష్ఫ్రరిణామాలను దృష్టిలో ఉంచుకొని కొత్త పాలసీలో అన్ని బార్లకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇదే సమయంలో పర్యాటక ప్రాంతాల్లో బార్ల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఎక్సైజు కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ గత నెలలో నోటిఫికేషన్‌ జారీ చేసి కొత్త బార్లను కేటాయించారు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన బార్లకు పలువురు పోటీ పడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో లైసెన్స్‌ కోసం ముందుకు రాక మిగిలిపోయాయి. రెండు విడతల్లో జరిగిన ఆన్‌లైన్‌ ఈ-వేలంలో 25 బార్ల వరకు మిగిలినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన బార్లకు లాంఛనాలు పూర్తి చేసి లైసెన్స్‌లు మంజూరు చేయడంతో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.

భారీగా ఆదాయం…
రాష్ట్రంలో మద్యం బార్ల లైసెన్స్‌ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ-వేలంలో రూ.597 కోట్ల ఆదాయం వచ్చింది. ఒకటికి మించి బార్‌ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా రెండు రోజుల పాటు ఆన్‌లైన్‌ విధానంలో ఈ-వేలం నిర్వహించారు. గతంలో ఏయే ప్రాంతాల్లో ఎంతెంత బిడ్డింగ్‌ జరిగిం దనేది రహస్యంగా టెండరు దాఖలు చేసేవారు. తదనంతరం ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా రెండింటిలో ఎక్కువ మొత్తం ఆఫర్‌ చేసిన వారికి లైసెన్స్‌ మంజూరు చేసేవారు.

దీనిని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరూ దాఖలు చేసిన మొత్తాలను ఇతరులు తెలుసుకునేలా ప్రదర్శించారు. తద్వారా పోటీ తత్వం పెరిగి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అధికారులు వేసిన అంచనాలు నిజమయ్యాయి. కొన్ని జిల్లాల్లో సిండికేట్లు రింగై ఆదాయానికి గండికొట్టినప్పటికీ ప్రకాశం లాంటి వెనుకబడిన జిల్లాల్లో రూ.కోట్లలో లైసెన్స్‌ మంజూరుకు రేటు పలికింది. తద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement