Sunday, November 24, 2024

AP | పక్కా ప్రణాళిక ప్రకారమే విద్యార్థిని హత్య : జిల్లా ఎస్పీ

( కడప బ్యూరో – ఆంధ్రప్రభ ) : కడప జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై యువకుడు పెట్రోల్ పోసి హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఇంటర్ విద్యార్థినిని పథకం ప్రకారమే నిందితుడు విఘ్నేశ్ హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి నిందితుడిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితుడు విఘ్నేశ్‌కు బాధిత బాలిక (16)కు ఐదేళ్లుగా పరిచయం ఉంది. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అయితే, సుమారు నెల‌ల‌ కిందట విఘ్నేశ్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు.

కాగా, శుక్రవారం ఉదయం అతను విద్యార్థిని ఫోన్ చేసి తనను కలవాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. శ‌నివారం ఉదయం బాలిక‌ను కలసి సెంచరీ ఫ్యాక్టరీ సమీపంలోని అడవిలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ విఘ్నేశ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుండి పారిపోయాడు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలోని నిందితుడిని 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కడప పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.’ అని ఎస్పీ తెలిపారు.

ఇక‌ నిందితుడికి వ్యతిరేకంగా దృఢమైన సాక్ష్యాలను సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. నేర స్థలంలో నిందితుడు నేరానికి ఉపయోగించిన పెట్రోల్ బాటిల్, ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించారు. నిందితుడు జక్కల విఘ్నేష్ పథకం ప్రకారం నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. పథకం ప్రకారం అతడు తన మొబైల్ ఉపయోగించకుండా కదపలోనే ఉంచి, తన భార్య మొబైల్ ఫోన్‌ మాత్రేమే వాడినట్లు గుర్తించారు. అయితే బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని తరచూ కోరడంతో, ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు ముందస్తు పథకంతో హత్య చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు.

మరణశిక్ష తరహాలో శిక్షించాలి : సీఎం చంద్రబాబు

- Advertisement -

ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటనపై నిన్నటి నుంచి పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి… ఎప్పటికప్పుడు ఆమెకు అందుతున్న చికిత్స గురించి, కేసు విచారణ గురించి తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సీఎంకు వివరించారు. వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సిఎం ఆదేశించారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే…. హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా శిక్షించడమే అని సిఎం అన్నారు. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్షపడేలా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు.

ఘటనలో నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement