బీసీల అభ్యున్నతే ధ్యేయంగా, బీసీ ఉపకులాల రాజకీయ సాధికారతకు కృషిచేసిన ఏకైక పార్టీగా వైఎస్సార్ సీపీ చరిత్రలో నిలుస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. రాష్ర్ట జనాభాలో 50శాతంపైగా ఉన్న వెనుకబడిన కులాల(బీసీ)అభ్యున్నతి కోసం పార్టీ ఇప్పటి వరకు చేసిన కృషి గతంలో ఏ ప్రభుత్వ పాలనలోనూ చూడలేదన్నారు. మూడున్నరేళ్ల పాలనలో బీసీల కోసం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలపై బీసీ అగ్రనేతలతో చర్చించేందుకు బుధవారం విజయవాడలో వైఎస్సార్ సీపీ బీసీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజిని, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ మార్గాని భరత్, పార్టీ బీసీ వింగ్ ప్రెసిడెంట్ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు.
సభలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం భవిష్యత్తులో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బీసీ సామాజిక వర్గంలోని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. గత టీడీపీ పాలనలో బీసీల అభివృద్ధిని గాలికి వదిలేశారని, చంద్రబాబు కేవలం రాజకీయాల కోసం బీసీలను ఉపయోగించుకున్నారని విమర్శించారు. అందుకోసమే బీసీ వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేసినట్లు వివరించారు.
రాష్ర్టంలో ప్రస్తుతం 139 బీసీ ఉపకులాలు ఉన్నట్లు తెలిపారు. బీసీలకు లబ్ధి చేకూర్చేందుకే నామినేటెడ్ పోస్టుల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. ఓబీసీ రిజర్వేషన్ బిల్లును వైఎస్సార్ సీపీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై ఇకపై జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ గత మూడున్నరేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బీసీల కోసం చేసింది ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. బీసీ ఇతర వెనుకబడిన కులాల రాజకీయ, ఆర్థిక సాధికారతకు కృషి చేస్తున్న సీఎం జగన్ సంఘసంస్కర్తగా చరిత్రలో నిలుస్తారన్నారు. సీఎం జగన్ దార్శనిక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ నేతలపైనే ఉందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 225 మంది బీసీ నేతలు పాల్గొన్నారు.