Tuesday, November 26, 2024

Delhi: ఏపీలో స్కూళ్ల విలీనాన్ని ఆపాలి.. కేంద్రానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల విలీనాన్ని ఆపాలని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో 377 కింద నోటీసు ఇచ్చారు. పాఠశాలలను విలీనం చేయడం ద్వారా టీచర్ పోస్టుల సంఖ్యను తగ్గించి ఏపీ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 1, 2 తరగతులను అంగన్‌వాడీల్లో విలీనం చేస్తున్నారని, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలతో అనుసంధానం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తిలో గణనీయమైన తేడా వస్తోందని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

తల్లిదండ్రులు, విద్యార్థుల నిరసనలను సైతం లెక్కచేయకుండా ఏపీ ప్రభుత్వం విలీన ప్రక్రియను కొనసాగిస్తోందని, ఈ గందరగోళానికి ఏపీ ఎన్‌ఈపీని సాకుగా చూపిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలు చెబుతూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 377 నిబంధనల ప్రకారం పాఠశాలల విలీనాన్ని రద్దు చేయాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విలీనం ప్రక్రియను నిలిపివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయవలసినదిగా ఆయన కేంద్రాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement