Monday, December 2, 2024

AP – TG | విభజన సమస్యలపై ముగిసిన భేటీ..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ సమావేశమైంది. మంగళగిరిలోని ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో అధికారులు సమావేశమయ్యారు. అయితే తాజాగా ఈ సమావేశం ముగిసింది.

ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. రెండు రాష్ట్రాల మధ్య రూ.861 కోట్ల మేరకు లేబర్ సెస్‌ను బదిలీ చేసేందుకు అంగీకరించారు. డ్రగ్స్ నివారణకు పోలీసు, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని అధికారులు నిర్ణయించారు. ఎక్సైజ్ శాఖ అదనంగా ఇచ్చిన రూ.81 కోట్లను తిరిగి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది.

అయితే విద్యుత్ బకాయిలుతో పాటు 9, 10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థల ఆస్తులు, అప్పులపై పంచాయతీ సెటిల్ అవ్వ‌లేదు. ముఖ్యంగా అప్పులపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఉద్యోగాల విభజనపై సుదీర్ఘంగా చర్చించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.

ఈ కీలక భేటీలో ఏపీ నుంచి సీఎస్, ఆర్థిక శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, జెన్‌కో సీఎండీ, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ హాజరు కాగా.. తెలంగాణ నుంచి సీఎస్, ఆర్థిక, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శలు, ఇతర అధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement