Saturday, November 23, 2024

ఘనంగా ముగిసిన పద్మావతి పరిణయోత్సవాలు..

తిరుమల, ప్రభన్యూస్‌: శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం గురువారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనం పై, దేవేరులు పల్లకి పై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు రెండు రోజుల మాదిరే ఎదుర్కోలు, పూలచెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన త రువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళాల వాయిద్యాలను ప్రదర్శించారు. ఇందులో శ్రీనివాస గద్యంతో పాటు హారికాంబోజి, నళితన కాంతి, కానడ, యమునా కళ్యాణి, శ్రీరాగం, మలహరి, నీలాంబరి రాగాలను పలికించారు. అర్చకులు రామకృష్ణ ధీక్షితులు ఆధ్వర్యంలో ఈ మూడురోజుల పరిణయోత్సవాలు జరిగాయి. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మధుసూధనరావు బృందం రసరమ్యంగా అన్నమాచార్య కీర్తలను ఆలపించారు. హారతి అనంతరం స్వామి దేవేరులతో కపసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడు రోజుల పద్మావతి పరిణయోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ప్రత్యేక ఆకర్షణగా అష్టలక్ష్మి దశావతార మండపం..

ఈ మూడు రోజుల పద్మావతి పరిణయోత్సవాలల్లో పూణకు చెందిన వెంకటేశ్వర చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అష్టలక్ష్మి దశావతార మండపం సెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాలుగు టన్నుల ఫలాలు, 30 వేల కట్‌ ఫ్లవర్లతో కలిపి మూడు టన్నుల పుష్పాలను మండపం అలంకరణకు వినియోగించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్‌వో నరసింహకిషోర్‌, ఎస్‌-2 జగదీశ్వర్‌ రెడ్డి, ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు తదితర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement