Sunday, November 24, 2024

AP: భార్య కోసం ఆ భర్త ఏం చేశాడంటే…

ఆత్మకూరు డిపో నుండి ఉదయం బస్సు చోరీ
ముచ్చుమర్రిలో బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు
భార్యను చూద్దామని బస్సు తెచ్చానని పోలీసులకు చెప్పిన ఘనుడు
నందికొట్కూరు రూరల్, జులై 27(ప్రభ న్యూస్) : భార్యను చూడటానికి ఏకంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సునే తెచ్చాడు ఓ ఘనుడు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆపి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంది. నా భార్యను చూసేందుకు ఏమి లేకపోవడంతో బస్టాండ్ లో బస్సు ఉందని, తాళాలు బస్సుకే ఉండటంతో బస్సును తీసుకెళ్లినట్లు పోలీసులకు సమాధానం ఇచ్చాడు బస్సు చోరాగ్రేసుడు. ఈ సంఘటన పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దరగయ్య అనే వ్యక్తికి ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మహిళతో వివాహ‌మైంది. వృత్తి రీత్యా దరగయ్య డ్రైవర్ గా పని చేస్తున్నారు. అయితే ఇతనికి మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు, అతని బంధువులు తెలిపారు. గత కొన్ని రోజులుగా భార్య ముచ్చుమర్రి గ్రామంలో ఉండటంతో దరగయ్య భార్యను చూడాలని అనుకొని తెల్లవారుజామున ఆత్మకూరు బస్టాండ్ వద్దకు వచ్చాడు. అతను ముచ్చుమర్రికి వెళ్లేందుకు ఏమి లేవని బస్టాండ్ లో బస్సును ఎక్కి చూడగా బస్సుకే తాళాలు ఉండటం చూసి బస్సును తీసుకెళ్ళి చూసొద్దామని బస్సు ఎత్తుకెళ్లాడు ఆ ఘనుడు.

ఆత్మకూరు డిపోలో డ్రైవర్ వచ్చి బస్సు చూడగా.. కనిపించకపోవడంతో బస్సు లేదని ఆత్మకూరు డిపో అధికారులకు తెలిపారు. వెంటనే బస్సు ఎటువెళ్లిందని సీసీ కెమెరాలు పరిశీలించగా బస్సు నందికొట్కూరు వైపు వెళ్లిందని తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. ముచ్చుమర్రి వైపు బస్సు వెళ్లిందని తెలిసి ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ కు ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ముచ్చుమర్రి ఏఎస్ఐ కృష్ణుడు బస్సును ఆపి దరగయ్యను అదుపులోకి తీసుకుని, బస్సును స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

దరగయ్యను విచారించగా భార్యను చూసేందుకు బస్సు తెచ్చానని ఒప్పుకున్నట్లు తెలిపారన్నారు. బస్సును ఆత్మకూరు డిపో వారికి అప్పగించినట్లు ఏఎస్ఐ కృష్ణుడు తెలిపారు.. దరగయ్యను మతిస్థిమితం సరిగ్గా లేకపోయినప్పటికీ బస్సును ఎక్కడ ప్రమాదానికి గురికాకుండా ముచ్చుమర్రికి తీసుకురావడం విశేషం.. ఏది ఏమైనప్పటికి ఆత్మకూరు డిపోలో బస్సు కే తాళాలు పెట్టడం అక్కడ పని చేస్తున్న డ్రైవర్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement