తిరుమల,ప్రభ న్యూస్ ప్రతినిధి:తిరుమలలో గోగర్భం డ్యామ్, పాపవినాశనం డ్యామ్‌లు జలకళను సంతరించుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాన్ కారణంగా ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాల కారణంగా పాపవినాశనం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 697.14 మీటర్లు కాగా ఇప్పటికే 693.60కి చేరుకుంది, గోగర్భం డ్యామ్, ఆకాశగంగ పూర్తిస్థాయి నీటిమట్టం 865 మీటర్లకు గాను 859.80 చేరుకుంది, కుమారధార పూర్తిసామర్థ్యం 898.24 మీటర్లు కాగా 896.20కి నీటిమట్టం చేరుకుంది, పసుపుధార డ్యామ్ సామర్థ్యం 898.28 కాగా ఇప్పటికే 895.90 మీటర్లకు చేరి పూర్తిగా నిండి పోయింది.
ఈ కారణంగా అధికారులు ఈ అర్ధరాత్రి గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదిలేస్తామని చెబుతున్నారు. వర్షానికి తోడు ఈదురు గాలులు వీస్తుండడంతో తిరుమలలో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు వాటిని తొలగించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక వర్షం కారణంగా రెండు ఘాట్‌రోడ్లలో పొగమంచు దట్టంగా ఉండడంతో ద్విచక్ర వాహనాలను రాత్రి 8 గంటల తరువాత నిలిపివేసి వాహన చోదకులు వాహనాలను అప్రమత్తంగా నడపాలని ఎప్పటికప్పుడు బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.
గతనాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఘాట్‌రోడ్డులో ప్రవహిస్తున్న జలపాతాల వద్ద భక్తులు వాహనాలు ఆపి సెల్ఫీలు తీసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. తుపాను వలన ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రెండు ఘాట్‌రోడ్లలో పొగమంచు దట్టంగా ఉంది. ముందున్న వాహనాలు సరిగా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గి సాధారణ స్థితి నెలకొనేంత వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను అనుమతిస్తామని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అధికారులతో కలసి జేఈవో వీరబ్రహ్మం ఘాట్‌రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, ఫారెస్ట్, సెక్యూరిటీ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలలో ఎస్ఈ జగదీశ్వర్‌రెడ్డి, విజివో నందకిషోర్, ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.