Saturday, November 23, 2024

తహసీల్దార్లు ఇచ్చే నిషేధిత భూముల జాబితా చెల్లదు.. ఆ అధికారం కలెక్టర్లకే ఉంది: హైకోర్టు

అమరావతి, ఆంధ్రప్రభ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిషేధిత భూముల జాబితాను ధృవీకరించే అధికారం కలెక్టర్లకే ఉందని హైకోర్టు తేల్చిచెప్పింది.. 22-ఏ భూములకు సంబంధించి తహసీల్దార్లుఇచ్చే జాబితా చట్ట విరుద్ధమని అది చెల్లదని స్పష్టం చేసింది. కలెక్టర్లు పంపే జాబితానే ప్రామాణికంగా తీసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని రిజిస్ట్రేషన్‌ అధికారులను ఆదేశించింది. తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు పంపితే వాటిని పరిగణనలోకి తీసుకోరాదని తీర్పునిచ్చింది. ఇతర శాఖల అధికారులు కూడా కలెక్టర్‌ ద్వారానే జాబితాను పంపేందుకు మాత్రమే చట్టం అనుమతిస్తుందని వివరించింది. అయితే వివిధ శాఖలు పంపే నిషేధిత భూముల జాబితాను పరిశీలించి వివరాలు సంత ృప్తికరంగా ఉంటే వాటిని రిజిస్ట్రేషన్‌ అధికారులకు పంపాలని ఈ వ్యవహారంలో కలెక్టర్లు పోస్టుమెన్‌లుగా వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. నేరుగా తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు నిషేధిత భూముల జాబితాను పంపితే తిప్పి పంపి కలెక్టర్‌ ద్వారా ప్రక్రియ నిర్వహించాల్సిందిగా కోరాలంది.

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగల్లు గ్రామంలోని 3.14 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ దాన్ని మదనపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌కు తహసీల్దారు పంపటాన్ని చట్ట విరుద్ధమని ప్రకటించింది. గ్రామంలోని రెండు సర్వే నెంబర్లలో గల 3.88 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు డి కృష్ణమూర్తి నాయుడుకు కేటాయించారు. ఆయన తన మరణానంతరం ఆ భూమి కొందరికి చెందేలా వీలునామా రాశారు. ఆయన మరణించిన తరువాత ఆ భూములు పొందిన వ్యక్తులు 3.88 ఎకరాల భూమిలో 3.14 ఎకరాల భూమిని విక్రయించేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌కు డాక్యుమెంట్లు సమర్పించారు. ఆ భూమిని నిషేధిత భూముల్లో చేరుస్తూ తహసీల్దారు జాబితా పంపారంటూ సబ్‌ రిజిస్ట్రార్‌ డాక్యుమెంట్లను తిరస్కరించారు. దీంతో లబ్దిదారులు దొమ్మాలపాటి సరళ, మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. పిటిషనర్ల తరుపు న్యాయవాది కొవ్వూరి వీఆర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. నిషేధిత జాబితా పంపే అధికారం తహసీల్దార్లకు లేదన్నారు.

ఆ భూమిని మాజీ సైనికోద్యోగుల కోటాలో కృష్ణమూర్తి నాయుడుకు కేటాయించారని వాటిని పదేళ్ల తరువాత అమ్ముకునే హక్కు పిటిషనర్లకు ఉందని వాదించారు. ప్రభుత్వ అసిస్టెంట్‌ ప్లీడర్‌ (ఏజీపీ) జోక్యం చేసుకుంటూ ఆ భూమి ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా కింద లేదని భూమిలేని నిరుపేదల కోటాలో కేటాయించామని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అయితే ఈ కేసులో తహసీల్దారు జాబితా పంపటం చట్ట విరుద్ధమని ఆ అధికారం కలెక్టర్లకే ఉందని తీర్పునిచ్చారు. రిజిస్ట్రేషన్‌ చట్ట ప్రకారం భూములపై ఇతర నిషేధపు ఉత్తర్వులు లేకపోతే రిజిస్టర్‌ చేయాలని సబ్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement