Tuesday, November 26, 2024

రాజధానిలో పేదల ఇళ్ల స్థలాలకు లైన్‌ క్లియర్‌.. ఆర్‌-5 జోన్‌పై వీడిన సస్పెన్స్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాజధాని అమరావతిలో ఆర్‌-5 జోన్‌పై నెలకొన్న సస్పెన్స్‌ వీడింది.. దీనిపై హైకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని ప్రకటించింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని ఆపలేమని స్పష్టం చేసింది.. అయితే జీవో 45 అమలు మాత్రం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని తేల్చిచెప్పింది.. పేదల అభ్యున్నతి కూడా రాజధానిలోఅంతర్భాగమే అని వ్యాఖ్యానించింది. రాజధాని వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌ లో ఉందని గుర్తుచేసింది. హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన రెండో ఆదేశాన్ని సుప్రీం కోర్టు స్టే చేయలేదని వివరించింది. ఎలక్ట్రానిక్‌ సిటీ భూములపై రైతులకు ఎలాంటి హక్కులులేవని చెప్తూ పిటిషనర్లు కోరినట్లు ఉత్తర్వులు జారీచేయటం న్యాయ ఔచిత్యాన్ని ఉల్లంఘించినట్లవుతుందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల వల్ల ప్రత్యక్షంగా పిటిషనర్లు ఏ విధంగా ప్రభావితం కారని అభిప్రాయపడింది. రాజధాని అభివృద్ధి కోసం భూసమీకరణలో భాగంగా తమ భూములు త్యాగం చేశామని చెబుతున్నారు.. ఎలక్ట్రానిక్‌ సిటీ కూడా అందులో భాగమని దీన్ని ధ్వంసం చేయటం తమ హక్కులను హరించటమే అవుతుందని రైతులు వాదిస్తున్నారు.. అస లు రాజధాని వ్యవహారం మొత్తంగా సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది.. అందువల్ల ఈ వ్యవహారంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తీర్పునిచ్చింది.

- Advertisement -

మాస్టర్‌ ప్లాన్‌లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ఎలాంటి ప్రాంతాన్ని గుర్తించలేదని ఆ భూమి ల్యాడ్‌ పూలింగ్‌ స్కీంలోలేదని ఎలక్ట్రానిక్‌ సిటీ భఊములు పేదలకు పంపిణీ చేస్తోందని మీరే (రైతులు) మా దృష్టికి తెచ్చారు.. ఆ భూమి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంలో లేనప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్న భూమితో రైతులకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. పేదలకు ఇవ్వదలచుకున్న ప్రాంతం ఎలక్ట్రానిక్‌ సిటీ పరిధిలో ఉందని రాజధానిలో మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నవనగ రాల నిర్మాణం అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని వివరించింది. ఏ విధంగాను పేదల ఇళ్ల స్థలాల పంపిణీ వల్ల రైతులు ప్రత్యక్షంగా ప్రభావితం కానప్పుడు ఏ రకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రశ్నించింది. అమరావతిలో రాజధానియేతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ నిమిత్తం ఆర్‌-5 జోన్‌ను కొత్తగా ఏర్పాటు చేయటంతో పాటు వివిధ గ్రామాల్లో 1134 ఎకరాల భూమిని గుంటూరు, ఎన్‌టీఆర్‌ జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్‌డీఏకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఈ మేరకు జీవో 45ను విడుదల చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. జీవో 45ను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఇందులో భాగంగా అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు.గత నెల 21వ తేదీన వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తీర్పును వెలువరించక ముందే ఈ వ్యాజ్యాలపై సత్వరమే విచారణ జరపాలని రైతుల తరుపు న్యాయవాది సంజయ్‌ సూరినేని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు లేఖ రాశారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తోందని ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. దీంతో హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ తిల్హారీలతో కూడిన ధర్మాసనం ఈనెల 3వ తేదీన మరోసారి విచారణ జరిపి రిజర్వు చేసిన తీర్పును శుక్రవారం వెలువరించింది.

రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా నియంత్రించలేమని చెప్తూ ఈ వ్యవహారంలో జోక్యానికి నిరాకరించింది. పట్టాలు పంపిణీ చేయకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలనే రైతుల అభ్యర్థనను త్రోసిపుచ్చింది. అనుబంధ పిటిషన్లను కొట్టేస్తూ ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రభుత్వం జారీచేసిన జీవో 45పై దాఖలైన ప్రధాన పిటిషన్‌లో తామిచ్చే తుది తీర్పునకు లోబడి అమలు చేయాలని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రబుత్వానికి అనుమతిచ్చిన హైకోర్టు విస్తృత ధర్మాసనం ఆర్థింగా వెనుకబడిన తరగతులు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఇతర అన్ని వర్గాలు రాజధాని అభివృద్ధిలో భాగమని ధర్మాసనం తీర్పులో వివరించింది. ఈ తీర్పును ుప్రీం కోర్టు స్టే చేయలేదని కూడా వ్యాఖ్యానించింది. రాజధాని వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున రౖౖెతులు కోరినట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తే అది న్యాయ ఔచిత్యాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని అభిప్రాయ పడింది. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఊరట లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement