Thursday, November 21, 2024

AP: అది తేలేదాకా చిరుతల పట్టివేత తప్పదా

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : తిరుమల నడక దారిలో ఒక బాలికను బలితీసుకున్న చిరుత పులి ఏదో తేలేదాకా చిరుతలను బంధించే కార్యక్రమం ఆగదని అటవీ అధికారులు చెబుతున్నారు. నెల రోజుల క్రితం తిరుమల నడకదారిలో అనూహ్యంగా చిరుత పులి దాడిలో లక్షిత అనే చిన్నారి దుర్మరణం పాలైన దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలురకాల చర్యలతో కాలినడకన తిరుమల వెళ్లే భక్తులను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాల (టీ టీ డీ) అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే నిన్నటి నుంచి నడచివేళ్ళే వారికి ఆత్మ స్థైర్యం కలిగించడానికి కర్రలను అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.

మరో వైపు నడకదారి పరిసర ప్రాంతాల్లో కెమెరాల నిఘా ఉంచిన అటవీ అధికారులు ఈరోజు వరకు ఐదు చిరుత పులులను బోన్ల ద్వారా బంధించారు. బంధించిన చిరుతలను ఎస్ వి జూ పార్క్ కు తరలించి వాటి డి ఎన్ ఏ లను పరిశోధన శాలలకు పంపిస్తున్నారు. అందులో ఏ చిరుత డి ఎన్ ఏ పరీక్ష ద్వారా చనిపోయిన లక్షితను చంపిందో తెలుసుకోడానికి కృషి చేస్తున్నారు. అది తెలితే మిగిలిన చిరుతలను దూరంగా ఉన్న చిట్టడవి ప్రాంతాల్లో వదిలిపెడతారు. లక్షితపై దాడి చేసిన చిరుతను కొన్ని నెలలు జూ లోనే విడిగా ఉంచి తగినంత మార్పు వచ్చిన తరువాత అడవిలో వదలడమో, మార్పు రాకపోతే మనిషి రక్తం రుచి మరిగిన ఆ చిరుతను కేంద్ర అధికారుల అనుమతితో చంపడమో చేయాల్సి వుంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు.

పరిశోధనా ఫలితాలు తేలే దాకా నడకదారి పరిసరాల్లోని కెమెరాలలో కనిపించే చిరుతలను బోన్ ల ద్వారా బంధించి జూ పార్క్ కు తరలించే పని కొంసాగుతుందని తెలుస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం శేషాచల అటవీ ప్రాంతంలో 25కు పైగా చిరుత పులులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆలిపిరి నడకదారిలో నామాల గాలిగోపురం నుంచి నరసింహాస్వామి గుడి వరకు ఇరువైపులా చిట్టడవులు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోనే కెమెరాలకు చిక్కిన ఐదు చిరుతలను పట్టుకున్నారు. ఇంకా అమలు చేస్తున్న రక్షణ చర్యలతో నిఘా కెమెరాలకు నడకదారి సమీపంలో కనిపించే చిరుతలను పట్టుకుని, వాటి డి ఎన్ ఏ లను పరిశోధన శాలలకు
పంపే కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఆ బాలికను చంపిన చిరుత ఏదో తేలే వరకు కెమెరాలకు కనిపించే చిరుతల పట్టివేత మరికొంత కాలం కొనసాగక తప్పదని స్పష్టం అవుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement