Friday, November 22, 2024

కృష్ణా ట్రైబ్యునల్ అవార్డును గెజిట్‌లో ప్రకటించలేదు.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నిర్ణయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బ్రజేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ చేసిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారిక గెజిట్‌లో నోటిఫై చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు రాతపూర్వకంగా జవాబిచ్చారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 2004లో బ్రజేష్‌ కుమార్‌ నేతృత్వంలో కృష్ణా జలాల వివాదాలపై ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2010లో ఈ ట్రైబ్యునల్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని అన్నారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 2011లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

వీటిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించే వరకు బ్రజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ సిఫార్సులను అధికారిక గెజిట్‌లో ప్రకటించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లుగా మంత్రి వివరించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ట్రైబ్యునల్‌ సిఫార్సులను ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌లో ప్రకటించలేదని తెలిపారు. కర్నాటకలో విజయనగర్‌ చానల్‌, తుంగ ఆనకట్ట, భద్ర ఆనకట్ట వ్యవ్యస్థలను ఆధునికీకరించినందున దాదాపు 13 టీఎంసీల జలాలను పొదుపు చేయగలిగినట్లుగా సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, కర్నాటక ప్రభుత్వ మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా వెల్లడైనట్లు మంత్రి తెలిపారు. కేంద్ర జల సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారం అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌లో జల లభ్యత, జల విధానాన్ని తిరిగి పరిశీలించాల్సిన అవసరం లేదని బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement