న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా గుడివాడ క్యాసినో వ్యవహారం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వద్దకు చేరింది. మంగళవారం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈడీ అధికారులను కలిసి గుడివాడ క్యాసినో వ్యవహారంపై విచారణ జరిపించాలని ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందని ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ… ఈడీ డైరక్టర్‌ను కలిసి రూ. 500 కోట్ల లావాదేవీలు జరిగినట్టు చెప్పామన్నారు.
క్యాసినో వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నిర్ధారణ కమిటీ సాక్ష్యాలు సేకరించి ఓ నివేదికను సిద్ధం చేసిందని, దానిని ఈడీకి అందించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుతుందన్నట్టుగా వైఎస్సార్సీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాసినో కార్యాకలాపాలను తొలుత ఖండించి, ఆ తర్వాత అంగీకరించిందని చెప్పుకొచ్చారు. దీనిపై రాష్ట్ర పోలీస్ యంత్రాంగం నిష్పాక్షిక దర్యాప్తు జరిపే అవకాశం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందుకే క్యాసినో వ్యవహారంలో జరిగిన మనీ లాండరింగ్ కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలని ఈడీని కోరామన్నారు. దేశంలో క్యాసినోపై నిషేధం అమల్లో ఉండగా క్యాసినో యంత్రాలు గుడివాడ ఎలా చేరాయని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఇందులో కచ్చితంగా దేశ భద్రతకు విఘాతం కల్గించే అంశాలు కూడా ఉన్నాయని ఆయన అందోళన వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..