ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం ఈనెల 12న తలపెట్టిన సమావేశంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తేదీ, సమయం మారకపోయినా వేదిక మారింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్-19 కొత్త కేసులు, ఒమిక్రాన్ రకం కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ సమావేశాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో తొలుత ఢిల్లీకి రావాల్సిందిగా రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు పంపించిన సందేశాన్ని మార్చి, రావాల్సిన అవసరం లేదని, వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశంలో పాల్గొనాలను తాజాగా మరో సందేశాన్ని పంపించింది. ముందు అనుకున్న ప్రకారమే ఈనెల 12న ఉదయం గం. 11.00కు భేటీ ప్రారంభం కానుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలు, వివాదాలను చర్చించనున్నారు.
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ తరహాలో ఇప్పటికీ పంచుకోని ఉమ్మడి ఆస్తులు సహా జల వివాదాలు, విద్యుత్ వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ భవన్ పంపకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 2 ప్రతిపాదనలు తయారుచేసినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం వాటిని అంగీకరించలేదు. ఈ క్రమంలో అపరిష్కృతంగా ఉన్న ఇలాంటి అంశాలకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులు సమావేశమవుతున్నాయి. రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సినవి మినహా అధికారుల స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అంశాలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital