Tuesday, November 26, 2024

AP: గడువులోగా ఇల్లు పూర్తి కావాల్సిందే.. మహమ్మద్ దివాన్ మైదీన్

శ్రీకాకుళం, నవంబర్ 29: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ నిర్మిస్తున్న ఇళ్ళు గడువులోగా పూర్తి కావాల్సిందేనని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదీన్ అన్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి గృహనిర్మాణ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో కలిసి వివిధ మండలాల ప్రగతిని సమీక్షించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లక్ష్య సాధనలో వెనుకంజ వేసే సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గృహనిర్మాణ ప్రగతిలో శ్రీకాకుళం జిల్లా మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానం వచ్చిందన్నారు. పారదర్శకంగా సేవలు అందించటంలో గృహనిర్మాణ శాఖ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. మెగా హౌసింగు డ్రెవ్ లో గృహాల నిర్మాణం పూర్తిచేసే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సచివాలయం వారీగా ఇంజనీరింగు అసిస్టెంట్లకు లక్ష్యం కేటాయించడమైనదని, లక్ష్యాలు పూర్తి చేయుటకు మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ది అధికారులు, హౌసింగ్, విద్యుత్ శాఖ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని ఇచ్చిన గడువులోగా పూర్తిచేయాలని తెలిపారు. నిర్మాణంలో జాప్యం జరగకుండా అవసరమైన సామాగ్రిని ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసి అవసరమైన వసతులను కల్పించాలని ఆయన అన్నారు.

ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడంలో జాప్యం జరగరాదని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని, నిధుల సమస్య లేనందున బిల్లుల తక్షణ చెల్లింపులకు చర్యలు తీసుకుంటామన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ… నిర్దేశించిన లక్ష్యాల మేరకు హౌసింగు సకాలంలో పూర్తిచేయుటకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందని, లక్ష్యాలను అధికారులు గడువులోపల పూర్తిచేయాలని తెలిపారు. నవరత్నాలలో భాగంగా పేదలందరకీ ఇళ్ళు పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతంగా తీసుకుందన్నారు. లబ్దిదారులకు ఇల్లు నిర్మాణంలో వేగవంతం చేసే విధంగా అధికారులు లబ్దిదారులకు ప్రేరణ కలిపించాలన్నారు. అధికారులు మండల స్థాయిలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఇల్లు నిర్మాణ లబ్దిదారుల లోటు పాటుల వివరాలను తెలుసుకొని అధిగమించాలన్నారు.

- Advertisement -

సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్ కూడా లబ్దిదారుల ఆధ్వర్యంలో ఇల్లు నిర్మాణాలపై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రేరణ కల్పించాలన్నారు. లబ్దిదారులకు నిర్మాణ దశలో ఉన్న పనులకు ఎంత మేర బిల్లుల చెల్లింపులు జరిగినవి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్.గణపతి, పలాస ఆర్డీఓ భరత్ నాయక్, డ్వామా పీడీ చిట్టిరాజు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈవీవీఎస్ ప్రసాద్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ నాగేశ్వరరావు, అర్బన్ సహాయ ఇంజినీర్ గణేష్, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిబ్బంది, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement