ఐఆర్ఆర్ కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే ఇతర రోడ్ల అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా పేర్కొంది.
ఈ నేపథ్యంలో, చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో సెప్టెంబరులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలను కోర్టుకు సమర్పించారు. అటు, సీఐడీ తరఫున ప్రభుత్వ న్యాయవాదులు కూడా లిఖితపూర్వక వాదనలను కోర్టులో దాఖలు చేశారు. ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి ఇరుపక్షాల లిఖితపూర్వక వాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు హైకోర్టు పేర్కొంది.