Wednesday, November 20, 2024

ఆర్టీసీ ఆదాయంలో ప్రభుత్వానికి వాటా.. ఆలోచనలో ఉన్నతాధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ ఆదాయంలో కొంత ప్రభుత్వానికి ఇచ్చే ఆలోచన సంస్థ చేస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం సమయంలో రాష్ట్ర శాసనసభలో చేసిన చట్ట సవరణలో ప్రభుత్వం దీనిని పొందుపరిచింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన రెండేళ్ల తర్వాత నుంచి ఆదాయంలో కొంత ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగుల విలీనం జరిగి రెండేళ్లు పూర్తయినందున కొంత ఆదాయం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని సంస్థ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఎంత శాతం ఇవ్వాలనేదానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ భవన్‌లో తిరుమలరావు మాట్లాడుతూ ప్రభుత్వం అడిగినప్పుడు ఆర్టీసీ ఆదాయం నుంచి కొంత ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు రూ.250 కోట్ల మేర నెలవారీ జీతాలు చెల్లిస్తోందని తెలిపారు. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తున్నందున ఆదాయంలో కొంత ఇవ్వకతప్పదన్నారు. ఎంతశాతం ఇవ్వాలనేదానిపై ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఉద్యమాలతో సాధించేదేమీ లేదు..

ఉద్యోగ సంఘాలు ఉద్యమాలతో సాధించేదేమీ లేదని ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీసీలో వీలైనంత త్వరలో కారుణ్య నియామకాలు పూర్తి చేస్తామని సంస్థ ఆయన స్పష్టం చేశారు. కారుణ్య నియామకాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 2015-19 మధ్య పెండింగ్‌లో ఉన్న నియామకాలు తొలుత భర్తీ చేస్తామని తెలిపారు. వీరిని విలేజ్‌ వార్డ్‌ సెక్రటేరియట్‌, ఆర్టీసీలోని ఖాళీల్లో భర్తీ చేస్తామన్నారు. కారుణ్య నియామకాల కింద 1,500 మందికి ఉద్యోగాలిస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల సానకూల ధోరణిలో ఉన్నారన్నారు. ఇతర శాఖలతో పోల్చితే ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. ఈ తరుణంలో ఉద్యోగులు సమ్మెకు వెళ్లటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు.

ఏటా 30 కోట్ల లీటర్ల డీజిల్‌..

ఆర్టీసీ ఏడాదికి 30 కోట్ల లీటర్ల డీజిల్‌ కొంటు-ందని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. రి-టైల్‌గా కంటే బల్క్‌గా కొంటేనే డీజిల్‌ ధర పెరుగుతోందన్నారు. ఏపీ, టీఎస్‌ ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్‌ ఉత్పాదన సంస్థలు ఆయిల్‌ సంస్థల నుంచి బల్క్‌గా డీజిల్‌ కొంటుందన్నారు. ఇందుకోసం ప్రతి మూడేళ్లకు టెండర్లు పిలిచి సంస్థల ఎంపిక చేస్తామన్నారు. కొత్త ఒప్పందం ప్రకారం మార్చి 1 నుంచి కొత్త రేట్లు- అమల్లోకి వస్తున్నాయని చెప్పారు. కొత్త రేట్ల ప్రకారం ఆర్టీసీపై రోజుకు రూ.32లక్షలు, నెలకు రూ.10కోట్ల మేర భారం పడుతుందని చెప్పారు. రిటైల్‌ బంక్‌లతో పోల్చితే లీటర్‌పై రూ.4.39 పైసలకు పైగా భారం పడుతుందన్నారు. ఆర్టీసీకి ఏలూరు, రాజోలు, రంగంపేట, ఉరవకొండలో రి-టైల్‌ బంకులు ఉన్నాయని, రి-టైల్‌ బంకుల నుంచే ఇంధనం కొనాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపధ్యంలో ఆయిల్‌ కంపెనీలు వినియోగదారులకు అందించే రేట్లు తగ్గిస్తూ గత నవంబర్‌ నుంచి బల్క్‌ డీజిల్‌ రేట్లు పెంచుతోందన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీపై అదనపు భారం తగ్గించుకునేందుకు రిటైల్‌ బంకుల్లో డీజిల్‌ కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. బల్క్‌ డీజిల్‌ రేట్లు రిటైల్‌ రేట్ల కంటే తగ్గిన పక్షంలో తిరిగి కొనుగోలు చేస్తామన్నారు. అప్పటి వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

- Advertisement -

100 ఎలక్ట్రికల్‌ బస్సులు..

ఆర్టీసీ తొందరలోనే 100 ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేయబోతోందని పేర్కొన్నారు. డీజిల్‌ బస్సుల స్థానంలో కొన్ని మార్పులు చేసి ఎలక్ట్రికల్‌ బస్సులుగా మార్చనున్నామన్నారు. ఇప్పటికే తయారు చేసిన ఓ బస్సును పూణ సంస్థకు పరిశీలన కోసం పంపామన్నారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తొలి విడతలో ప్రయోగాత్మకంగా వంద బస్సులను తీసుకొస్తామన్నారు. ఒక్కొక్క బస్సు తయారీకి రూ.5లక్షల నుంచి రూ.6లక్షలు మాత్రమే ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కేఎస్‌ బ్రహ్మానంద రెడ్డి(ఆపరేషన్స్‌), ఏ.కోటేశ్వరరావు (పరిపాలన) తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement