అమరావతి, ఆంధ్రప్రభ : డ్వాక్రా సంఘాల విలీనానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండేళ్ల ముందు ఇచ్చిన సర్క్యులర్‌ను ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొస్తోంది. యానిమేటర్ల సంఖ్యను తగ్గించి..ఆ పనిని వెల్ఫేర్ అసిస్టెంట్లకు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు- తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా యానియేటర్ల తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు- సమాచారం. ఇప్పటికే ఉమ్మడి కొన్ని జిల్లాల్లో అధికారులు సర్వేకు సిద్ధమయినట్లు వినికిడి. ఇదే జరిగితే యానిమేటర్ల తొలగింపును నిరసిస్తూ ఆందోళనలకు సన్నద్ధమవుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని స్వయం సహాయక గ్రూపులకు రుణాలు ఇప్పించడంలో యానిమేటర్లు (విఒఎ) కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేడంలోనూ వీరిపాత్ర కీలకం. గతంలో ఒక్కో యానిమేటర్ పరిధిలో 60 నుంచి 70కి పైగా సంఘాలుండేవి. పని సౌలభ్యం నిమిత్తం ఆరేళ్ల క్రితం సంఘాలను విడగొట్టారు. ఒక్కో యానిమేటర్ పరిధిలో 50 సంఘాలు ఉండేలా చేశారు. దీంతో మరికొంత మంది యానిమేటర్లను నియమించుకుంది. ఇంతమంది అవసరం లేదని, ఎక్కువ మందిని తొలగిం చాలని రెండేళ్ల క్రితం సర్య్కలర్ 64ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఆ సమయంలో చిత్తూరు జిల్లాలో అప్పటి పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో విఒఎలను తొలగించబోమని మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
ఇదిలావుండగా సర్య్కులర్‌ను అధికారులు ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చారు. ఒక్కో యానిమేటర్ పరిధిలో 30 కన్నా తక్కువ సంఘాలున్న వారిని విధుల నుంచి తొలగిస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టి యానిమేటర్లను తొలగించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా కొన్ని జిల్లాల్లో ఈ నిబంధనలను ఉపయోగించి కొంత మంది యానిమేటర్లను తొలగించారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దళాలను రంగంలోకి దింపి యానిమేటర్ల తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. రాష్టంలోని 26 జిల్లాల్లో సుమారు 30వేల మంది విఒఎలు పనిచేస్తున్నారు. సర్క్యులర్ అమలు చేస్తే దాదాపు 40శాతం మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారు. దీంతో విఒఎలు మళ్లీ ఆందోళనలకు సిద్ధమయ్యారు. యానిమేటర్ల తొలగింపును నిరసిస్తూ వివిధ దశల్లో పోరాటం చేయనున్నామని ఆ సంఘం రాష్ట్ర నాయకులు రెడ్డెప్ప తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.