అమరావతి, అంధ్రప్రభ : రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పెరిగిన వంట నూనెల ధరలు తగ్గించే విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై మంగళవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో నూనెల ధరల పెరుగుదల నియంత్రణకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ రైతు బజారుల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి వంటనూనెలు నిర్దేశిత ధరకు వినియోగదారులకు అందేవిధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని పొర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. సన్ ప్లవర్, వేరుశెనగ, పామాయిల్ వంటనూనెలు నిర్దేశిత ఎంఆర్పి ధరలమేరకు వినియోగదారులకు అందేలా చూడాలని, వంటనూనెల ధరల పెరుగుదల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద వివిధ రైతు బజారుల్లో అదనపు కొంటర్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు వంటనూనెలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రైతు బజార్లతో పాటు వివిధ చౌకధరల దుకాణాల ద్వారా కూడా వంటనూనెలు ప్రజలకు విక్రయించేందుకు చర్యలు చేపట్టాలన్నారు అంతేగాక స్వయం సహాయక బృందాలు, మొబైల్ వాహనాలు ద్వారా కూడా వంటనూనెలు తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేయాలని డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.
వంటనూనెలకు సంబంధించి వివిధ హోల్‌సేల్ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీదారులు, సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ మరియు స్టాకిస్టులు కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్ కు లోబడి స్టాకు పరిమితిని పాటించాలని సీఎస్ ఆదేశించారు. ఈ విషయంపై రెవెన్యూ, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు తదితర విభాగాల అధికారులు తనిఖీలు చేయాలన్నారు. ఎక్కడైనా అక్రమ స్టాకు గుర్తిస్తే వాటిని స్వాధీనం చేసుకుని బహిరంగ మార్కెట్లోకి వెంటనే విడుదల చేసి తక్కువ ధరకు వినియోగదారులకు అందేలా చూడాలని చెప్పారు. వ్యవసాయ-సహకారశాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షులుగా పౌరసరఫరాల శాఖ కమీషనర్ కన్వీనర్ గాను, ప్రణాళికాశాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమంట్, తూనికలు కొలతలు శాఖ కంట్రోలర్, వ్యవసాయ-మార్కెటింగ్ శాఖ కమీషనర్,వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్,ఎపి ఆయిల్ ఫెడ్ విసి అండ్ ఎండి, ఎపిఎస్సిఎస్సిఎల్ విసి అండ్ ఎండి, సిఇఓ రైతు బజార్ మరియు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సిఎస్ సభ్యులుగా ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ ప్రతి రోజు సమావేశమై వంటనూనెల ధరలను సమీక్షించి ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సిఎస్ చెప్పారు. అదే విధంగా జిల్లా కలక్టర్ (సివిల్ సప్లయిస్) మరియు డిఎస్‌ఓల నేతృత్వంలో ధరల వంటనూనెల ధరల పెరుగుదలపై నిఘాపెట్టి అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై 6-ఎ కేసులు నమెదు చేసి స్టాకును స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..