శ్రీకాకుళం, నవంబర్ 8: మౌలిక వసతుల కల్పనే తమ ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల (శ్రీకాకుళం నగరం) అదనపు తరగతులతో కూడిన భవంతిని ఆయన ప్రారంభించారు. ఇందు కోసం కోటీ పదహారు లక్షల రూపాయలు వెచ్చించారు. అదనపు భవంతిని త్వరితగతిన పూర్తి చేసినందుకు సంబంధిత వర్గాలను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వై.ఎస్.జగన్ హయాంలో పనిచేస్తున్న ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు సమున్నత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సర్వశిక్ష అభయాన్ నిధులతో రూపుదిద్దుకున్న ఈ భవనం ఇక్కడి విద్యార్థులకు వసతి సమస్యలను తీరుస్తుందని, అలానే మరిన్ని ఆధునిక సౌకర్యాలను కూడా పాఠశాలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. నాడు – నేడు ప్రణాళికలో భాగంగా ఇవాళ అనేక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని, అదేవిధంగా విద్యారంగంలో జిల్లా అధికారులు చేస్తోన్న కృషి అభినందనీయంగా ఉందని కితాబిచ్చారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. విద్యతోనే సమాజంలో గౌరవం ఉంటుందని, అలానే సామాజిక ఉన్నతి సాధ్యం అవుతుందని నమ్మి ఈ ప్రభుత్వం సంబంధిత రంగానికి అత్యున్నత స్థాయి ప్రాధాన్యం ఇస్తూ, నిధులు విడుదల చేస్తోందని పునరుద్ఘాటించారు.