ఉమ్మడి గుంటూరు, ప్రభన్యూస్ బ్యూరో: కరువు పీడిత పల్నాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. ఏపీ ప్రజల మరో అద్భుత కలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చే పనిలో పడ్డారు. కొన్నేండ్లుగా కాగితాలకే పరిమితమైన వరికపూడిసెల ఎత్తిపోతల పథకం ఇప్పుడు సాకారం అవుతోంది. ఆ ప్రాజెక్టు నిర్మించే ప్రదేశం -టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు.. అలాగని దాన్ని వేరేమార్గంలో చేపట్టే యోచన, చిత్తశుద్ధి గత పాలకులకు లేకపోవడంతో అది అక్కడే ఆగిపోయింది. ఇన్నాళ్లకు సీఎం జగన్ కృషితో అది వాస్తవరూపంలోకి రానున్నది. వరికపూడిసెల ఎత్తిపోతల తొలి దశ పనులను రూ.340.26 కోట్లతో చేపట్టేందుకు పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తున్నారు.
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రేపు (బుదవారం) పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలగుంట గ్రామంలో వరికపూడిసెల లిప్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి రేపు ఉదయం 9.45 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి మాచర్లకు చేరుకుంటారు. అక్కడ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
తొలిదశలో 24,900 ఎకరాలకు నీరు
తొలిదశ పనులను వేగంగా పూర్తి చేసి.. అధునాతన పైప్ ఇరిగేషన్ ద్వారా 24,900 ఎకరాలకు నీళ్లు అందించనున్నారు. నిజానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కి.మీ.ల ఎగువన కృష్ణా నదిలో వరికపూడిసెల వాగు కలవక ముందే.. ఆ వాగు నుంచి జలాలను ఎత్తిపోసి పల్నాడు భూములకు ఇవ్వాలన్నది ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన. అయితే ఈ పనులు టైగర్ రిజర్వ్ ఫారెస్టులో చేపట్టడానికి కేంద్రం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి మళ్లీ కదలిక వచ్చింది. దీంతో గోదావరి-కృష్ణా- పెన్నా అనుసంధానం తొలి దశ పనులతో పాటు వరికపూడిసెల ఎత్తిపోతల తొలిదశ పనులను అధికారులు చేపట్టారు.
వరికపూడిసెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.340.26 కోట్లతో చేపట్టారు.అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 4 కి.మీ.ల పొడవున పైప్ లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఇన్నాళ్లుగా ఈ ప్రాజెక్టు ఆగింది ఈ అనుమతులు రానందునే.
ఇప్పుడు ఆ ఫారెస్ట్ భూమికి ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. పలు మార్లు కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరిపిన తర్వాత వరికపూడిసెల ఎత్తిపోతలకు ఏప్రిల్ 28న అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఎత్తిపోతల ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి వీలుగా పైప్ లైన్లు వేయనున్నారు. పైపులైన్ల ద్వారా నీటిని తరలించడం వల్ల సరఫరా నష్టాలు ఉండవని ఆయకట్టు-కు సమర్థవంతంగా నీటిని అందించవచ్చని అధికారులు చెప్తున్నారు.
మాచర్ల, వినుకొండ తాగునీటి అవసరాలు
ఈ పథకానికి నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టిఆర్) మీదుగా నాలుగు కి.మీ పైప్‌లైన్ వేయాల్సిన అవసరం ఉన్నందున పర్యావరణ, అటవీ అనుమతులలో జాప్యం కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ప్రతిపాదిత ప్రాజెక్టు గంగలగుంట రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నందున ఈ ఏడాది మేలో జాతీయ వన్యప్రాణి బోర్డు ఈ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసింది. కరువు ప్రాంత ప్రజల కష్టాలను తీర్చేందుకు లిప్ట్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి గతంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రిని కలిశారు.
నాగార్జునసాగర్ సమీపంలో కృష్ణానదిలో కలిపే వరికపూడిసెల వాగు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. మాచర్ల, వినుకొండ ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం ఈ పథకం లక్ష్యం. వెల్దుర్తి మండలంలోని ఏడు గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంతోపాటు.. దాదాపు 25 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు వాగు నుంచి 280 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడమే లక్ష్యంగా ఫేజ్-1లో దాదాపు రూ.350 కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
వాగు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌ను ఏర్పాటు- చేయనున్నారు.కేంద్రం నుంచి వన్యప్రాణుల అనుమతులు పొందేందుకు, పర్యావరణ, ఇతర అనుమతులతో పాటు- ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు జగన్ మోహన్ రెడ్డి సహకరించారు. 70 ఏళ్ల క్రితమే ప్రాజెక్టును ప్రతిపాదించి ఆయా ప్రభుత్వాలు శంకుస్థాపన చేసినా అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్టు కాగితాల్లోనే మిగిలిపోయింది. పైగా పల్నాడు ఎగువ ప్రాంతంలో నివసించే ప్రజలు తాగునీరు, సాగునీటి అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.