( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ప్రజాస్వామ్య పురోగమణానికి ఓటు పునాది వంటిదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజా స్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని, యువత తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు కోరారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రారంభమైన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ, సిపి ఎస్.వి.రాజశేఖర్‌బాబు ప్రారంభించారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఓటు హక్కు అమూల్యమైనదని, ప్రజాస్వామ్య సమాజంలో పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన అహింసా సాదనం ఓటు హక్కు అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మన రాజ్యాంగం పౌరులందరికీ సమాన ఓటు హక్కును కల్పించిందన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం దేశంలోని యువత అత్యంత చిత్తశుద్దితో ఓటు హక్కును వినియోగించుకుని ఇతరలకు స్పూర్తిగా నిలవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి ప్రభావం లేకుండా దేశాన్ని ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశంగా నిలబెట్టడంలో ఎన్నికల వ్యవస్థ కీలక పాత్ర వహిస్తుందన్నారు. యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి ఓటు హక్కును పొందాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ… 18సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటర్లుగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై స్థిరమైన విశ్వాసం కలిగి స్వచ్ఛ న్యాయమైన శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ఎన్నికల్లో జాతి కుల మతాలకు తావులేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఓటర్లుగా పేర్లను నమోదు చేసేకునేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యువత కృషి చేయాలని నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు కోరారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్‌డివో చైతన్య, ఎన్‌ఎస్‌ఎస్ స్టేట్ కో ఆర్డినేటర్ చంద్రమౌళి, జిల్లా కో ఆర్డినేటర్ కె.రమేష్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ బి.యుగంధర్, పోర్మం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కో ఆర్డినేటర్ అరవ రమేష్, వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్లకార్డు ప్రదర్శించి ర్యాలీలో పాల్గొన్నారు.