రాజానగరం , ఆంధ్రప్రభ : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారికి అనుకుని ఉన్న పెట్రోల్ బంక్లో అగ్నిప్రమాదం జరిగింది. తుని నుండి విజయవాడ వెళుతున్న ఒక లారీ, బంకులో డీజిల్ కొట్టిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఇంజన్ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి… దీంతో బంకులోని సిబ్బంది, వాహనదారులూ భయాందోళనలతో పరుగులు తీశారు.
బంక్ సిబ్బంది అప్రమత్తమై.. బంకులో ఉన్న ఫైర్ సిలిండర్లతో హుటాహుటిన ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. అప్పటికే సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. గంట తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీలో షార్టు సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ఫైర్ అధికారులు తెలియజేశారు.