Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP | తండ్రి రాసిన అంతిమ తీర్పు

AP | తండ్రి రాసిన అంతిమ తీర్పు

0
AP | తండ్రి రాసిన అంతిమ తీర్పు
  • కువైట్​ నుంచి వచ్చి లేపేశాడు!
  • కూతురుపై లైంగిక దాడికి ప్రతికారం
  • కీచకుడికి బాధితురాలి తండ్రి మరణ శిక్ష
  • పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు
  • డబ్బులు తీసుకొని అన్యాయం చేశారు
  • అందుకే చంపేశానని సెల్ఫీ వీడియో


ఆంధ్రప్రభ స్మార్ట్​, అన్నమయ్య జిల్లా ప్రతినిధి: తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముసలోడిపై చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడితే… రాజీమార్గంలో నిందితుడిని పోలీసులు వదిలేస్తే.. డబ్బులిస్తే పోలీసులేం చేస్తారూ.. అంటూ ఆ వికలాంగ వృద్ధుడు కాలర్ ఎగరేసి సభ్య సమాజంలో తిరుగుతుంటే.. బాధితురాలి కన్న తండ్రి తట్టుకోలేకపోయాడు. భారతీయుడు సినిమా స్టయిల్ లో చట్టాన్ని తన చేతులోకి తీసుకున్నాడు. ఆ కీచకుడ్ని చంపేశాడు. తన బిడ్డకు న్యాయం చేశానని, త్వరలోనే పోలీసులకు లొంగిపోతానని వాట్స్ అప్ మెసేజీ పంపాడు. ఈ ఘటన ఏపీలో తీవ్ర సంచలనం రేపింది.

వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేటకు చెందిన ఆంజనేయ ప్రసాద్, చంద్ర కళ వ్యవసాయ కూలీలు. ఉపాధికి ఇబ్బంది కావటంతో కువైట్ కు వలస వెళ్లారు. చంద్రకళ చెల్లి లక్ష్మీకి తన పదకొండేళ్ల కుమార్తె ఆలనాపాలన బాధ్యతలు అప్పగించారు. లక్ష్మీ తండ్రి పుట్ట ఆంజనేయులు దివ్యాంగుడు. (58) కూడా మంగంపేటలోనే ఉంటున్నాడు. గత 6వ తేదీన చంద్రకళ కుమార్తె ఇంట్లో నిద్రిస్తుండగా ఆంజనేయులు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కేకలకు లక్ష్మీ నిద్ర లేచింది. పరిస్థితిని తెలుసుకుంది. తన వద్ద కుమార్తెను తీసుకువెళ్లాలని తన అక్క చంద్రకళకు కబురు పంపింది. గ్రామానికి చేరిన చంద్రకళ ఏమి జరిగిందని తన కుమార్తను ప్రశ్నించింది. తాత చేసిన అఘాయిత్యాన్ని ఆ బాలిక వివరించింది. ఇదే విషయాన్ని కువైట్ లోని తన భర్త ఆంజనేయ ప్రసాద్కు చంద్రకళ తెలిపింది. వెంటనే కేసు పెట్టాలని తన భర్త ఆదేశంతో పోలీసు స్టేషన్ కు వెళ్లి చంద్రకళ ఫిర్యాదు చేసింది.

దీంతో కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు .. ఈ విషయాన్ని బయట పెట్టుకుంటే బాలిక జీవితంపై ప్రభావం చూపుతుందని, కేసు వద్దని రాజీ చేశారు. ఇక పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఆంజనేయులు విపరీత ధొరణితో ప్రవర్తించాడు. తాను పోలీసులకు డబ్బు ఇచ్చానని, ఈ కేసు నన్నేం చేస్తుందని గ్రామంలో కాలర్ ఎగరవేశాడు. దీంతో ఆ బాలికపై అఘాయిత్యంపై గ్రామంలో ప్రచారం వైరల్ అయింది. ఈ విషయం తల్లి చంద్రకళకు తెలియటంతో.. తాము ఫిర్యాదు చేస్తే నిందితుడిని ఎలా వదిలేశారని ప్రశ్నించింది. డబ్బులు తీసుకున్నారా? అని నిలదీసింది. ఇదే విషయంపై పోలీసులు స్పందించి చెల్లి లక్ష్మీని గట్టిగా ప్రశ్నించారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె సమాధానం ఇవ్వటంతో.. లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంటే కేసు పెడతామని పోలీసులు చంద్రకళను హెచ్చరించారు.

ఇలా ఈ బాలికపై లైంగిక దాడి కేసు దారి మళ్లటంతో.. తండ్రి ఆంజనేయ ప్రసాద్ తట్టుకోలేకపోయాడు. తన బిడ్డకు అన్యాయం జరిగిందని, తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోలేదని మనస్థాపానికి గురయ్యాడు. కువైట్ నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేసి వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. ఈ హత్యాఘటనను పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇంతలో ఈ హత్యోదంతాన్ని వివరిస్తూ తండ్రి ఆంజనేయ ప్రసాద్ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. ఆడ బిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని.. పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు.

Exit mobile version