కొత్త ఏడాది నాడు సరికొత్త వివాదం తలెత్తింది.. ఇన్నాళ్లు చూస్తూ చూస్తూ గమ్మునవాళ్లు కాస్తా.. మాటా మాటా అనుకున్నారు. ఇగోలకు పోయి.. తగాదాపడ్డారు. చేయి చేయి చేసుకుని గొడవకు దిగారు.. కత్తులతో దాడి చేసుకునే కాడికి పోయిందీ లొల్లి.. ఈ ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. ఇదంతా పెంపుడు కోళ్ల విషయంలో వచ్చిన గొడవ అంటే అందరూ నవ్వే పరిస్థితి వచ్చింది.. విషయం ఏంటంటే..
పెంపుడు కోళ్ల విషయంలో రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న వివాదం.. ఏకంగా కొందరిని ఆస్పత్రి పాలు చేసింది. ఈ ఘటన కృష్ణ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వీరులపాడు మండలం చెన్నారావు పాలానికి చెందిన రెండు కుటుంబాల మధ్య పెంపుడు కోళ్ల విషయంలో వివాదం ఏర్పడింది. వారం రోజుల నుంచి ఇరు కుటుంబాల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఇరు కుటుంబాలు ఏకంగా కత్తులతో దాడి చేసుకున్నారు.
మీ కోళ్లు మా ఇంటివైపుకి వస్తున్నాయని ఒక ఫ్యామిలీ మరొక ఫ్యామిలీని ప్రశ్నించింది. కోళ్లను పెంచుకుంటున్న ఫ్యామిలీ పై పొరుగువారు గొడవకు దిగినట్లు బాధిత ఫ్యామిలీ చెబుతోంది. అది చూసిన తాము కోళ్లు ఇంటివైపు వస్తున్నాయని తిడుతూ ఉన్న వారిని.. ఇదేమిటి అని ప్రశ్నించినందుకు తమపై దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.