Tuesday, November 26, 2024

ఇక్కడ చార్జీల పెంపు, అక్కడి బస్సులకు కలిసివస్తోంది.. లాభాల్లోకి ఏపీఎస్​ఆర్టీసీ..

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీఎస్‌ ఆర్టీసీకి దూరప్రాంత సర్వీసులుు సిరులు కురిపిస్తున్నాయి. తెలంగాణకు వెళ్లే దూర ప్రాంత సర్వీసులు ముఖ్యంగా హైదరాబాద్‌ రూట్‌లో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. టీఎస్‌ ఆర్టీసీ డీజిల్‌ సెస్‌ పెంపు ఏపీఎస్‌ ఆర్టీసీ ఆదాయం పెరిగేందుకు దోహదపడుతోంది. నాలుగు రోజుల్లోనే అత్యధిక ఓఆర్‌(ఆక్యుపెన్సీ రేషియో)తో రూ.4.90 కోట్లు ఆర్టీసీకి ఆదాయం సమకూరింది. తెలంగాణ ప్రయాణికులు సైతం ఏపీ బస్సుల వైపే మొగ్గు చూపుతుండటంతో అధికారులు ముందస్తు రిజర్వేషన్‌ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు. తెలంగాణ ఆర్టీసీ చార్జీలు దశల వారీగా పెంచడం.. బస్సుల నిర్వహణ లోపాలు ఏపీఎస్‌ ఆర్టీసీ కలిసొస్తున్నాయి. ఈ నెల 9న టీఎస్‌ ఆర్టీసీ రెండోసారి భారీగా డీజిల్‌ సెస్‌ పెంచింది. పల్లెవెలుగు సర్వీసుల నుంచి ఏసీ బస్సుల వరకు కిలో మీటర్ల వారీగా రూ.5 నుంచి రూ.170 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు రాష్ట్రాల బస్సుల మధ్య చార్జీల్లో భారీ వ్యత్యాసం నెలకొంది. ఏపీ బస్సుల్లో రూ.70 నుంచి రూ.110 వరకు వ్యత్యాసం ఉండటంతో తెలంగాణ ప్రయాణికులు కూడా ఏపీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. పైగా ఏపీ బస్సుల్లో నిర్వహణ కూడా ప్రయాణికులను ఆకర్షిస్తోంది. గత రెండేళ్లలో తెలంగాణ ఆర్టీసీ చార్జీలు గణనీయంగా పెరిగాయి. డీజిల్‌ రేట్లు గణనీయంగా పెరగడంతో గతేడాది సెస్‌ పెంచారు.

ఇదే సమయంలో ఆర్టీసీ చార్జీలను సైతం అక్కడి అధికారులు పెంచారు. రోజు రోజుకూ బస్సుల నిర్వహణ భారంగా మారడంతో ఈ నెల 9న టీఎస్‌ ఆర్టీసీ మరోసారి డీజిల్‌ సెస్‌ పెంచింది. ఒక్కసారిగా రూ.5 నుంచి రూ.170 వరకు కిలో మీటర్ల లెక్కన డీజిల్‌ సెస్‌ పెంచడంతో చార్జీలు పెద్ద మొత్తంలో పెరిగాయి. రోజు రోజుకూ డీజిల్‌ రేట్లు పెరుగుతూ నిర్వహణ భారంగా మారడంతో చార్జీల పెంపుకు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు నిర్ణయించినప్పటికీ..ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. పైగా ఉద్యోగులు, అధికారుల జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారులు అమలు చేయకతప్పలేదు. ఈ క్రమంలోనే రెండు నెలల కిందట డీజిల్‌ సెస్‌ను ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు నామమాత్రంగా పెంచారు. కిలో మీటర్ల లెక్కన కాకుండా ఒక్కొక్క టిక్కెట్టుపై రూ.5 నుంచి రూ.20 వరకు పెంచారు. చిల్లర సమస్య తలెత్తకుండా చార్జీల సర్థుబాటు కూడా చేయడంతో కొంతమేర చార్జీలు పెరిగిన తెలంగాణ, కర్నాటక, తమిళనాడు సర్వీసులతో పోల్చినప్పుడు తక్కువేనని అధికారులు చెపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బస్సుల్లో డీజిల్‌ సెస్‌ పెంపు హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే బస్సులకు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగి ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. విద్యార్థుల బస్సు పాసులను కూడా టీఎస్‌ ఆర్టీసీ భారీగా పెంచడంతో ఏపీ బస్సుల్లో తిరిగేందుకే వారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

నాలుగు రోజుల్లో రూ.4.90 కోట్లు..

నాలుగు రోజుల్లో హైదరాబాద్‌ సర్వీసుల ద్వారా ఏపీఎస్‌ ఆర్టీసీ రూ.4.90 కోట్లు ఆర్జించినట్లు ఆర్టీసీ గణాంకాలు చెపుతున్నారు. జూన్‌ 9న 86శాతం ఓఆర్‌తో ఈపీకే(ఎర్న్‌ పర్‌ కిలో మీటర్‌) సగటున రూ.50.38తో రూ.కోటి 19లక్షల ఆదాయం ఏపీఎస్‌ ఆర్టీసీకి సమకూరింది. 10వ తేదీన 87శాతం ఓఆర్‌తో ఈపీకే రూ.51.04 ఉండగా రూ.కోటి 21లక్షల ఆదాయం వచ్చింది. 11వ తేదీన 91శాతం ఓఆర్‌తో ఈపీకే రూ.53.35 కాగా రూ.కోటి 26లక్షల ఆదాయం రాగా ఆదివారం 89శాతం ఓఆర్‌తో ఈపీకే రూ.52.15 చొప్పున రూ.కోటి 24లక్షల ఆదాయం వచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement