Monday, November 18, 2024

Big Story | కోరలు చాస్తున్న ‘కుల’ జాడ్యం.. రాజకీయాలకూ అదే పరమావధా?

“గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు
మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు
పసలేని వాడు ప్రాంతం ఊసేత్తుతాడు
జనులంతా ఒక కుటుంబం. జగమంతా ఒక నిలయం “

– మహాకవి జాషువా

మహాకవి జాషువా కొన్ని దశాబ్దాల క్రితం రాసుకున్న ఈ కవిత వర్తమాన సమాజానికి సరిగ్గా సరిపోతుంది. ఈ సమాజంలో వ్యవస్థలన్నింటిని కులరక్కసి కలుషితం చేస్తోంది. ప్రధానంగా రాజకీయాలు ‘కులం’ కబంధ హస్తాల్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. ఇందుకు ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. భావితరాలకు కులం అనే విషాన్ని పంచటంలో రాజకీయ పార్టీలు ఒకదానిని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు ఉత్తరాదిన ఏవో కొన్ని రాష్ట్రాలకు పరిమితం అయిన ఈ కుల జాడ్యం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకూ విస్తరించింది. ఇంతకు ముందు కూడా కులం వంటి పట్టింపులు ఉన్నప్పటికి, ఇంతలా బరితెగించలేదు. దేశమంతా ఆజాదీకా అమృతోత్సవ్ వంటి మహత్తర కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న తరుణంలో ఈ కుల జాడ్యం ఒక మాయని మచ్చలా మారింది.

– ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి, గుంటూరు

ప్రాంతీయ పార్టీల ఏర్పాటుతోనే కుల రాజకీయాలు మొగ్గతొడిగాయి. జాతీయ పార్టీలలో కుల భావన ఒకింత తక్కువగానే వుంటుందని చెప్పవచ్చు. ప్రాంతీయ పార్టీలు ఏవీ కులం ప్రాతిపదికగా ఏర్పాటు కానప్పటికి, వాటి మనుగడకు అదే ఆలంబనగా నిలుస్తున్నది. తెలుగునేలపై దశాబ్దాల క్రితమే రాజకీయాలలో కుల ప్రస్తావనకు అంకురార్పణ జరిగింది. రాజ్యాంగబద్ధంగా లభించిన రిజర్వేషన్ లను మినహాయిస్తే వివిధ పార్టీలు ఎన్నికలలో టిక్కెట్ ల కేటాయింపులో కులం ప్రధాన భూమిక పోషిస్తున్నది. అర్ధబలం, అంగబలం, నేరచరిత్ర అనేవి అదనపు అర్హతలుగా పరిణమించాయి.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కులప్రస్తావనలు ఇటీవలి కాలంలో అధికం అయ్యాయి. ప్రతి సంఘటనకూ కులం రంగుపులుముకోవటం ఆనవాయితీగా మారింది. కులాభిమానం, కులప్రస్తావన తప్పు కాకపోయినప్పటికి, ఆ కారణంగా విద్వేషాలు రగుల్కోనే పరిస్థితులు వుత్పన్నం అయితే అది ఏమాత్రం సమర్ధనీయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఇప్పుడీవిధమైన అవాంఛనీయ పరిణామం వేళ్లూనుకుంటున్నది. గతంలోనూ కులం పేరుతో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు వున్నాయి. అది ఇప్పుడది శ్రుతిమించి రాగాన పడింది.

అధికారంలో వున్న పెద్దలు, బాధ్యతాయుత స్థానాలలో వున్న కొంతమంది నాయకులు ఈ కుల ప్రస్తావనకు శ్రీకారం చుట్టడంతో దీనికి రాజముద్ర పడినట్టు అయింది. క్రమేపీ అది సామాజిక మాధ్యమాలకు విస్తరించింది. దానిని నియంత్రించాల్సిన స్తానాలలో వున్న వారు మిన్నకుండటంతో కుల రక్కసి జూలు విదులుస్తోంది. విశ్వజనీన భావన వుండే రైతుకు సైతం కులం రంగు పులిమే దౌర్భాగ్య పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అసలు ఒక నేరానికి, కులానికి వున్న సంబంధం ఏమిటి? నేరానికి అతీతంగా వుండే కులం ఏదైనా వుంటుందా? అన్న భావన ఏ ఒక్కరిలోనూ చోటుచేసుకోకపోవటం దురదృష్టకరం.

- Advertisement -

సమాజంలో రెండే వర్గాలు వుంటాయి. ఒకరు దోపిడీ చేసే వారు ఆయితే, మరొకరు దోపిడీకి గురయ్యేవారు. ఒకరు బాధించే వారు అయితే మరొకరు బాధకు గురయ్యేవారు. ఒకరు నేరస్తుడు అయితే మరొకరు బాధితుడు. వీటికి ఏ కులమూ మినహాయింపు కాదు. కేవలం వ్యక్తుల తప్పిదాలుగానే పరిగణించాలి. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని కులానికి ఆపాదించటం ఎవరు చేసినా అంతకు మించిన నేరం మరొకటి వుండదు.

సామాజిక మాధ్యమాలలో పెడుతున్న పోస్టింగ్ ల కారణంగా కొన్ని కులాలు, కొంతమంది వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అటువంటి సందర్భాలలో పోలీసు యంత్రాంగం సూమోటో గా కేసులు నమోదుచేసి కులవిద్వేషాలు ప్రబలకుండా చూడాల్సి వుంది. అయితే ప్రస్తుతం ఆ తరహా కేసుల నమోదులో తీవ్ర వివక్ష చోటుచేసుకుంటున్నదన్న భావన ఏర్పడుతున్నది. అందుకు కొంతమంది అధికారుల వైఖరి కారణం అని చెప్పక తప్పదు. పేదయినా, రాజయినా, సామాన్యుడైనా, అసామాన్యులైనా, హోదాలతో నిమిత్తం లేకుండా అందరికీ ఒకేవిధమైన విధానం అవలంబిస్తే ఈ విషప్రచారాలకు కొంతమేర అడ్డుకట్ట వేసే అవకాశం వుంటుంది. ఆ దిశగా రాజకీయ నాయకులు, బాధ్యతాయుత స్థానాలలో వున్న వారు దిశానిర్దేశం చేయాల్సి వుంటుంది. ప్రస్తుతం అటువంటి ప్రయత్నాలు మచ్చుకు సైతం కానరావటం లేదు. ప్రస్తుత సమాజంలో చైతన్యం రావాలంటే గుర్రం జాషువా వంటి మహాకవి మళ్ళీ పుట్టాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement