అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో డ్రోన్ల శకం జోరందుకుంటోంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఈ డ్రోన్ల వ్యవస్ధను వినియోగంలోకి తీసుకువచ్చినా కేవలం వాటిని నిఘా పరమైన అవసరాలకే పరిమితమయ్యేవి. డ్రోన్లకు అమర్చిన కెమేరాల ద్వారా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఉత్సవాలు, వీఐపీల మూమెంట్స్ తదితర వాటికి బందోబస్తులో భాగంగా సమాచారాన్ని సేకరించడం జరిగేది. ఇంకా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రాబల్యం కలిగిన జిల్లాలు, ఉగ్ర కార్యకలాపాల నేపధ్యంలో మనిషి కూడా వెళ్ళని చోటుకి డ్రోన్లను పంపి అక్కడ పరిస్ధితి, వ్యక్తులను వీక్షించడంతోపాటు, సమాచారాన్ని రికార్డు చేసేవారు. ఇది రక్షణ రంగానికి సంబంధించి వినియోగంలో డ్రోన్ల పాత్ర. ఇందుకోసం పోలీసుశాఖ స్వయంగా డ్రోన్లను స్వంతంగా సమకూర్చుకోవడంతో పాటు వీటి నిర్వహణకు ప్రత్యేక సాంకేతిక వ్యవస్ధ, పైలెట్‌లను శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేసుకుంది.
మరి పోలీసుశాఖ మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల కు సైతం ఇప్పుడు డ్రోన్లను వాడకం అనివార్యమైంది. వ్యవసాయం, వ్యవసాయేతర, పారిశ్రామిక రంగాలలో డ్రోన్ల వినియోగం పెరిగింది. దీంతో డ్రోన్లకు క్రమేణా డిమాండు పెరుగుతోంది. ఇదే సమయంలో డ్రోన్ల పర్యవేక్షణ, వినియోగానికి పైలెట్‌ల వ్యవస్ధకు ప్రాముఖ్యత ఏర్పడింది. నిర్వహణ, పైలెట్‌ల వ్యవస్ధ లేనిదే డ్రోన్ల వినియోగం సాధ్యం కాదు. పోలీసుశాఖ మాదిరిగా ఇతర శాఖలకు ఇది సాధ్యంకాని పరిస్ధితి. అందువల్ల ఇతర ప్రభుత్వ శాఖలు తమ కార్యకలాపాలకు డ్రోన్లను వినియోగించాలనుకుంటే ఇందుకు ప్రత్యేక వ్యవస్ధ అవశ్యం. అందుకు సంబంధించి ప్రభుత్వమే ఈ దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అంతవరకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు సంస్ధలను ఆశ్రయించక తప్పదు. ఈక్రమంలో డ్రోన్ల డిమాండ్‌ను తీర్చడానికి ఒక స్టార్టప్ కంపెనీ ముందుకు వచ్చింది.
డీజీసీఏ అనుమతులు..
శిక్షణతోపాటు నిపుణులైన డ్రోన్ ఆపరేటర్లను తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది. డ్రోన్‌లను ఆపరేట్ చేసే పైలెట్ల కోసం డ్రోగో డ్రోన్స్ అనే స్టార్టప్ కంపెనీ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. ఇటీవల శిక్షణ కేంద్రాన్ని తనిఖీలు నిర్వహించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ప్రతినిధులు ఎన్‌ఓసీ జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో డ్రోన్లను ఆపరేట్ చేయడానికి, పైలెట్‌లకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన అనుమతులు పొందిన ఏ-కై-క సంస్థ డ్రోగో డ్రోన్స్. డీజీసీఏ జారీ చేసిన సిలబస్ ప్రకారం డ్రోన్ ఆపరేటర్లకు వారం రోజుల శిక్షణను అందిస్తుంది. థియరీ క్లాసులతోపాటు ప్రాక్టికల్‌గా ఫీల్డ్‌లో డ్రోన్ల ఆపరేషన్‌లో తర్ఫీదు ఇస్తారు. ఇందుకు సంబంధించి సిలబస్‌ను నిపుణులచే రూపకల్పన చేశారు. శిక్షణ కోసం సదరు సంస్ధ సుమారు 50 ఎకరాల్లో ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఒక్కో బ్యాచ్‌లో 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు డీజీసీఏ నుంచి అనుమతి లభించింది.
20 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం
కాగా డీజీసీఏ నిబంధనల ప్రకారం డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందాలనుకునే వారికి 18 ఏళ్లు నిండి కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కాగా త్వరలో డ్రోన్ల తయారీ యూనిట్ కూడా రాష్ట్రంలో ప్రారంభం కానుంది. డ్రోన్‌ల విడిభాగాల తయారీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని వివిధ సంస్థలకు అవసరమైన సర్వేలను నిర్వహించడంలో ఆయా శాఖలు ఈ డ్రోన్లపైనే ఆధారపడుతున్నాయి. ఇప్పటికే నేషనల్ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, ఎన్‌ఎండీసీ, ఎంఇఐఎల్, జీఎఐఎల్, ఏపీఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ ఇతర ప్రముఖ సంస్థల కోసం అవసరమైన భూ సర్వేలను ఈడ్రోగో డ్రోన్లు నిర్వహిం చాయి. ఇప్పటి వరకు దాదాపు 7 వేల హెక్టార్ల భూమిని సర్వే చేశారు. నిర్ణీత సమయంలో సర్వే పనులను పూర్తి చేయడానికి ఈ రంగంలో ఏఐ అండ్ ఎంఎల్ వంటి అధునాతన సాంకేతికతలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో డ్రోన్ల వినియోగానికి నూతన శకం ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.