Friday, November 22, 2024

AP | బోసిపోతున్న శ్రీశైలం జలాశయం, అడుగంటిన నీరు.. ఇన్ ప్లో జీరో

అమరావతి, ఆంధ్రప్రభ : వర్షాలు పడుతున్నా సాగునీటి కరవు తీరే దారి కనబడటం లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న శ్రీశైలం రిజర్వాయర్‌కు ఒక్క చుక్క కూడా ఎగువ నుంచి వచ్చి చేరటం లేదు. బుధవారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌ ఇన్‌ ప్లో జీరోగా నమోదయిందంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 215.81 టీఎంసీల నీటి నిల్వ సామర్దం కలిగిన శ్రీశైలం రిజర్వాయర్‌ లో ప్రస్తుతం 82.59 టీఎంసీలు.. 38.27 శాతం నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి నీళ్ళను కూడా విద్యుదుత్పత్తికి వినియోగంచటంతో శ్రీశైలం రిజర్వాయర్‌ బోసిపోతోంది.

రిజర్వాయర్లలో చేరుకున్న నీటిని తాగునీటి అవసరాలకూ, ఆ తరువాత వ్యవసాయ అవసరాలకు వినియోగించాలని కృష్ణా బోర్డుతో పాటు కేంద్ర జలసంఘం పదే పదే చెబుతున్నా పట్టించుకుంటు-న్న దాఖలాలు కానరావటం లేదు. ఆగస్టు నెలలోని తొలి రెండు వారాలో శ్రీశైలం రిజర్వాయర్‌ నీటిని విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం తోడేసింది. ఫలితంగా మూడో వారం నుంచి రిజర్వాయర్‌ కనిష్ట స్థాయికి అడుగంటింది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు…ఆగస్టు రెండవ వారంలో 870 అడుగుల దాకా నీరుంటే ఇపుడు 851 అడుగులకు తగ్గిపోయింది.

- Advertisement -

ఎడమగట్టు పవర్‌ హౌస్‌ నుంచి విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్‌ కోకు కృష్ణా బోర్డు లేఖ రాసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. నీటి అవసరాల కోసం తెలంగాణకు ఎలాంటి ఇండెంట్‌ ఇవ్వలేదని కృష్ణా బోర్డు చెప్పినా విద్యుదుత్పత్తి అంశం బోర్డు పరిధిలోనిది కాదని అక్కడి అధికారులు చెబుతున్నారు.

సాగర్‌కు నీటి విడుదల కోసం ఇండెంట్‌ ఇస్తేనే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుందని కృష్ణా బోర్డు చెప్పటం నిబంధనలకు విరుద్ధమనీ, శ్రీశైలం నిండిన తరువాతే సాగర్‌కు నీటిని విడుదల చేయాలన్న వాదన సహేతుకం కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11,12న కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 0.192 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 7.975 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేసినట్టు రికార్డయింది. ఫలితంగా శ్రీశైలం నీటి నిల్వలన్నీ అడుగంటాయి..ఆ తరువాత వర్షాలు జాడ లేకపోవటంతో రిజర్వాయర్‌ బోసిపోతూ ఉంది.

సాగర్‌ వెలవెల

శ్రీశైలం దిగువన నాగార్జున సాగర్‌ కూడా వెలవెలపోతోంది. గత ఏడాది ఇదే సమయానికి పరవళ్ళు తొక్కిన నాగార్జున సాగర్‌ ప్రస్తుతం గరిష్ట నీటి నిల్వ సామర్దంలో 50 శాతానికి పరిమితమైంది. బుధవారం సాయంత్రానికి 312 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్ద్యానికి గాను 156.67 టీఎంసీల నిల్వలున్నాయి. సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల రిజర్వాయర్‌లోనూ సగం నిల్వలే ఉన్నాయి. 45.77 టీఎంసీల గరిష్ట సామర్ద్యానికి గాను 22.05 టీఎంసీల నిల్వలున్నాయి. స్థానికంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో ప్రకాశం బ్యారేజి మాత్రం నిండుకుండలా కళకళ లాడుతోంది. 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్దంతో ప్రకాశం బ్యారేజి జలకళ సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement