విజయనగరం, (ప్రభ న్యూస్): అడ్డంగా దొరికిపోయినా ఏమీ కాదనుకుంటున్నారో? మహా సముద్రంలో చెంచాడు నీరు పోతే ఏమవుతుందిలే అనుకుంటున్నారో? తెలీదు గానీ జిల్లాలో గంజాయి మాఫియా ఆగడాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. రవాణా పంథాలో మార్పు రావచ్చేమో గానీ గంజాయి గమ్యం చేర్పు విషయంలో మాఫియా రాజీపడని పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది.
తాజాగా గురువారం గజపతినగరం-ఆండ్ర మార్గమధ్యంలో రెండు కార్లను వెంబడించిన పోలీసులకు 459 కిలోల గంజాయి పట్టుబడిన వైనం అక్రమ రవాణా నిరంతర ప్రక్రియ అని మాఫియా చెప్పకనేచెప్పినట్లయింది. నిషేధిత గుట్కా, ఖైనీ, గంజాయి..ఏదైనా కావచ్చు.. విజయనగరం జిల్లాయే వాటి అక్రమ రవాణాకు అడ్డాగా మారిందన్నది పోలీసులు సైతం అంగీకరించాల్సిందే.
స్పెషల్ డ్రైవ్ పేరిట ఎస్‌ఈబీ దాడులు కూడా మాఫియా ఆగడాలను ఎంత మాత్రం కట్టడి చేయలేకపోయిన పరిస్థితి.
విశాఖ ఏజెన్సీకు ఎస్.కోట మైదాన ప్రాంతం ముఖద్వారంగా వుండటం వలన గంజాయి మాఫియా ఆ మార్గం గుండా అక్రమ రవాణాకు పెద్ద పీట వేస్తున్నారు.
భోగాపురం హైవేపై ఏకంగా 1400 కిలోల మొత్తంలో గంజాయిని ఒక లారీలో తరలిస్తుండగా భోగాపురం పోలీసులు పట్టుకున్న వైనం తెలిసిందే. కొత్తవలస మండల పరిధిలో 500 కిలోల గంజాయి పట్టుబడిన క్రమం విదితమే. వాస్తవ పరిస్థితులు ఏమైనప్పికీ గంజాయి మాఫియా అనుసరిస్తున్న రవాణా విధానాలు పోలీసులకు సవాల్‌గా మారాయన్నది నిర్వివాదాంశం. ఖైనీ అక్రమ రవాణా అన్నది నిరంతర ప్రక్రియగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily