Thursday, November 21, 2024

AP | వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్‌.. కుమారుడితో కలిసి పొలంలో సంద‌డి..

అమరావతి, ఆంధ్రప్రభ: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తన కుమారుడితో కలిసి వరి నాట్లను పరిశీలిస్తూ సందడి చేశారు. పొలంలోకి దిగి కుమారుడితో క‌లిసి వరి నాటు వేయించి రైతులను ఆహ్లాదపరిచారు. జిల్లాలోని కామనగరువు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో రబీ సీజన్‌ లో వ్యవసాయ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్ళిన ఆయన రైతులతో మాట్లాడారు. తన కుమారుడితో కలిసి పొలంలో దిగి వరి నాట్ల పద్ధతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీలో సాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా తక్కువ కాల పరిమితి కలిగిన అధిక దిగుబడుల నిచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ఏటా సాగు చేసే సాంప్రదాయ రకాలకు బదులుగా ఆయా ప్రాంతాల నేల స్వభావానికి అనుగుణమైన కొత్త వరి వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు వినియోగించాలన్నారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను అవసరమైన మేరకు మాత్రమే వాడాలని రైతులకు సూచించారు. అక్కడి వరి సాగుపై ఆయన ఆరా తీయగా 125 రోజులు పంట కాలపరిమితి కలిగిన ఎంపియు 1121 రుక వరి వంగడాన్ని ఎంపిక చేసుకున్నామని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బీకే, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement