విశాఖపట్నం, ఆగస్టు 22 (ప్రభ న్యూస్) : చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అన్న చందంగా మారింది పరిశ్రమల శాఖ తీరు. ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే సేఫ్టీ ఆడిట్ అంటూ పలుమార్లు ప్రకటన చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఆ తరువాత ఆ మాటే మరిచిపోతున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం ఇప్పుడు పలు ఆరోపణలకు తావిస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. అయితే కనీసం అగ్నిమాపక సామాగ్రి కూడా అందుబాటులో లేని పరిశ్రమలు, అందుబాటులో లేని పరిశ్రమలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి.
అభివృద్ధి అవసరమే అయితే అది ప్రాణం తీసేలా ఉండకూడదు కదా.. ఇప్పుడు అదే జరుగుతోంది. పాలిమర్ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే ఇప్పుడు రాంబిల్లి మండలం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు.. అసలు పరిశ్రమల్లో ఏం జరుగుతుందో అధికారులకు తెలుసా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు పరిశ్రమలను తనిఖీ చేసేందుకు అధికారులు వెళ్తున్నారా లేదా.. ప్రమాదం జరిగినప్పుడు ప్రకటనలు చేస్తున్న ప్రజాప్రతినిధులు సైతం వీటిని పట్టించుకోవడం లేదు. ఫలితం అన్యం పుణ్యం తెలియని కార్మికులు బలి. కష్టపడదాం కొంత జీతం వస్తుంది, కుటుంబాన్ని పోషించుకుందాం అనే ఆలోచనతో కార్మికులు పరిశ్రమలకు వెళ్తున్నారు. అక్కడ భద్రత ఉందా లేదా అనేది వాళ్ళకి అప్రస్తుతం. భద్రత చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అధికారులదే కదా.
ఇదే కోవలో కైలాస పట్నం ఘటన..
రెండు రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ కావడంతో అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఇబ్బడి ముబ్బడిగా వసతి గృహాలను ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేస్తున్న విషయం అధికారులకు తెలియదా. తెలిసినా పట్టించుకోలేదా.. ఫలితం ముగ్గురు చిన్నారుల ప్రాణాలు బలి. వెంటనే మళ్ళీ పాతపాటే. వస్తే గృహాలు ఏర్పాటు చేయాలంటే అనుమతులు కావాలి.. లేదంటే చర్యలు తీసుకుంటాం.. అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఈ రెండు మాటలు చెప్పడం అలవాటుగా మారింది.
ఇప్పుడు ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదానికి బాధ్యులు ఎవరు.. ఎందుకు రియాక్టర్ పేలింది.. అనే విషయాలను ఇంకా అధికారులు వెల్లడించాల్సి ఉంది. మొత్తం మీద కార్మికుల జీవితాలపై ఈ రియాక్టర్ పేలుడు ఘటన తీవ్ర ప్రభావం చూపింది. ఫార్మాసిటీ కంపెనీని అధికారులు సేఫ్టీ ఆడిట్ చేశారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏదైనా ఈ పాపంలో అందరూ పాలుపంచుకున్నట్లే మారింది. ఫలితం మాత్రం కార్మికుల జీవితాలు మసకబారాయి. ఎంత ఆర్థిక సాయం చేసినా మరణించిన వారు రారు.. వారు లేని లోటు తీర్చలేరు. చివరకు ఇలాంటి సంఘటనలన్నీ కార్మికుల జీవితాలకు పరిపాటిగా మారాయి. ఇప్పటికైనా పరిశ్రమల శాఖ ఇలాంటి కంపెనీలపై ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.