తిరుమల : నూతన పాలక మండలి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి ఈ అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న టీటీడీ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రముఖ దేవస్థానాల్లో అన్యమతస్థులు ఉండటం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అన్యమతస్తులను ప్రభుత్వ రంగంలో బదిలీ చేయాలనే నిర్ణయం శుభదాయకమన్నారు. హిందూ దేవాలయాల్లో హిందువులే విధులు నిర్వహించాలన్నారు.
అన్యమతస్తులు ఉండటం వల్ల అభిప్రాయ బేధాలు వస్తున్నాయన్నారు. తిరుమలలో రాజకీయ ఉపన్యాసాలు, ప్రసంగాలను నిషేధించడం శుభపరిణామమన్నారు. రాజకీయ పరమైన కార్యక్రమాలు చేపడితే శిక్ష విధించేలా పాలకమండలి చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు తుంగలో తొక్కిన వారిపై ప్రివిలేజ్, దర్శన విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.
కొన్ని సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు గతంలో దెబ్బతిన్నాయన్నారు. తిరుమల పర్యాటక కేంద్రం కాదు… హిందూ దేవతలపై విశ్వాసం విధేయత ఉండే వాళ్లకే దర్శనం కల్పించడం హర్షణీయమన్నారు. స్థానికులకు దర్శన సదుపాయం కల్పించడం మంచి నిర్ణయమన్నారు.