Tuesday, November 19, 2024

AP: ఇప్పటి అరెస్టు ఆరంభం మాత్రమే : చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : ఎన్నో అవినీతి కేసుల్లో ఉన్న చంద్రబాబు పాపాలు పండడం మొదలైంది.. ఆ అవినీతి చరిత్రలో ఇప్పటి అరెస్టు ఆరంభం మాత్రమే.. ఇంకా ఇతర అవినీతి కార్యకలాపాలపై విచారణ నివేదికలు బయటకు రాబోతున్నాయి.. ఆ అవినీతి గురించి ప్రజలకు తెలుసు కనుకనే చంద్రబాబు అరెస్టు పేరుతో తెలుగుదేశం చేపట్టిన బంద్ విఫలమైందని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలోని తమ క్యాంపు ఆఫీస్ లో ఈరోజు సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్టుకు ప్రజల మద్దతు లేదని ఈరోజు విఫలమైన బంద్ చాటి చెప్పిందన్నారు.

పుంగనూరులో చంద్రబాబు అరాచకానికి నిరసనగా చిత్తూరు జిల్లాలో నిర్వహించిన బంద్ విజయవంతం కావడాన్ని గుర్తు చేసారు. కానీ చంద్రబాబు అరెస్టు అయినందుకు ఈరోజు తెలుగుదేశం చేపట్టిన బంద్ కు హెరిటేజ్ సంస్థ కూడా మూత పడలేదన్నారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు అయిన స్కామ్ లో వాస్తవాలు ఉన్నందుననే ఆయన అడ్వకేట్ కానీ, ఆయన మద్దతుదారులు కానీ ఇతర అంశాలను మాత్రమే చూపిస్తున్నారన్నారు. ఇటువంటి ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయని, అన్నింటి నిగ్గు త్వరలో తేలుతుందని, నిజాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. ఒకవిధంగా ఇప్పటి చంద్రబాబు అరెస్టు ఆరంభం మాత్రమేనని స్పష్టం చేసారు. జైలులో చంద్రబాబుకు ప్రాణభయం ఉందని దాఖలైన పిటిషన్ పై ప్రశ్నించగా ఆయన మరింత కాలం క్షేమంగా ఉండి చేసిన పాపాలకు ఇంకా శిక్షలు అనుభవించాలని కోరుకునే తాము ఆయన్ని ఏదో చేస్తామని చెప్పడం కేవలం రాజకీయలబ్ది కోసమేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement