Friday, November 22, 2024

Delhi | 2025 వరకు పోలవరం గడవు పొడిగింపు.. స్పష్టం చేసిన ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువు మరోసారి పెరిగింది. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన నిర్మాణ గడువు తాజాగా 2025 జూన్ వరకు పెరిగింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి స్వయంగా వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశం ఎజెండాలో 6 అంశాలను పొందుపర్చినప్పటికీ, సవరించిన అంచనాల వ్యవహారంపై చర్చ జరగకుండా సమీక్ష ముగిసింది.

ఈ భేటీలో కేంద్ర మంత్రితో పాటు ఆ శాఖ సలహాదారులు వెదిరె శ్రీరామ్, జలవనరుల విభాగం ప్రత్యేక కార్యదర్శి, సెంట్రల్ వాటర్ కమిషన్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓతో పాటు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం ఎజెండాలో ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు, ఆర్థిక వనరులు మొదటి అంశంగా పెట్టుకున్నారు. పునరావాస కుటుంబాలు, ముంపు సర్వేను రెండో అంశంగా, తొలి దశలో మిగతా పనుల నిర్మాణం పూర్తిచేయడం కోసం సవరించిన అంచనాలను మూడో అంశంగా పేర్కొన్నారు. సివిల్ వర్క్స్ లో అప్‌స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ సహా పలు ఇతర అంశాలను 4వ అంశంగా, ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ముంపు పరిధిని 5వ అంశంగా పేర్కొన్నారు.

- Advertisement -

చివరి అంశంగా అప్పటికప్పుడు లేవనెత్తే ఏదైనా ముఖ్యమైన ఇతర అంశాన్ని పొందుపరిచారు. అయితే ఆర్థిక వనరులు, సవరించిన అంచనాల గురించి సమావేశంలో చర్చ జరగలేదు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తవ్వాలన్నదే తమ సంకల్పమని వెల్లడించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి.. ప్రాజెక్టు నిర్మాణ గడువును 2025 జూన్ కి పొడిగించినట్టు తెలిపారు. అయితే అంతకంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.

తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామని వెల్లడించారు. ఈ ఎత్తు వరకు ఎంత మేర ముంపు జరుగుతుందో ఆ మేరకు పరిహారం, పునరావాసం కల్పించేందుకు నిధులను విడుదల చేయాలంటూ కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. అలాగే నిర్మాణం వేగంగా పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తూ అడహక్ నిధుల కింద రూ. 17,414 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అడిగిందని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement