Friday, December 13, 2024

Exclusive | పసుపు సైన్యంలో గంపెడాశ…

  • ఎమ్మెల్సీ హోదా కోసం ఎదురు చూపులు
  • అభ్యర్థుల ఎంపికలో ముందస్తు కసరత్తు
  • ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా
  • వచ్చే మార్చి నాటికి మరో ఐదు స్థానాలు ఖాళీ
  • వైసీపీలో ఇమడలేమని ఎనిమిది మంది బయటకు రెడీ
  • పసుపు కోటకు తమ్ముళ్ల పరుగులు
  • అధినేత ప్రసన్నం కోసం యజ్ఞాలు

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ : ఏపీ శాసన మండలిలో పరిపూర్ణ బలం కోసం కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీలో తీర్మానించిన వివిధ బిల్లులకు పెద్దల సభ ఆమోదం అత్యవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో నామమాత్రం బలంతో వైసీపీ అత్యంత దీన స్థితిలో ఉండగా.. శాసన మండలిలో కూటమి ప్రభుత్వం కంటే అత్యధిక బలంతో వైసీపీ చెలరేగిపోతోంది.

ఈ స్థితిలో శాసన మండలిలో తమ బలాన్ని పెంచుకునేందుకు కూటమి సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇదే తరుణంలో ఎమ్మెల్సీ హోదా కోసం.. తెలుగు తమ్ముళ్లల్లో త్యాగధనులు పసుపు కోటకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ ఉప ఎన్నికల వేడి చల్లారింది.

ఇదే తరుణంలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలికి రాజీనామా చేశారు. మరో 8 మంది అసంతృప్తితో వైసీపీలో ఇమడలేక పోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ ఎనిమిది మంది కూడా శాసన మండలికి దూరం కానున్నారని రాజకీయ వర్గాల అంచనా. ఇక వచ్చే మార్చిలో మరో 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీలు ఏర్పడుతాయి. పొలిటికల్ ఎనలిస్టుల అంచనాలు నిజమైతే మొత్తంగా 17 స్థానాలను భర్తీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే 10‌‌ స్థానాల్లో కూటమి ఎమ్మెల్సీలు ఉన్నారు. తదుపరి 17 స్థానాలనూ కూటమి కైవసం చేసుకుంటే వైసీపీ బలం తగ్గుతుంది.

కసరత్తులో అధినేత బిజీబిజీ

ఎమ్మెల్సీ పదవుల భర్తీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. కొందరు ముఖ్య నేతలను పిలిచి చర్చ ప్రారంభించారు. ఇప్పటికే జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకారం జనసేన ఎమ్మెల్సీ బెర్త్ నాగబాబుకు ఖరారు అయినట్టే.

- Advertisement -

ఇక 16 స్థానాల్లో బీజేపీకి ఎన్ని? జనసేనకు ఎన్ని అనే లెక్కతేలితే.. తెలుగు తమ్ముళ్లల్లో ఎవరి ఆశలు నెరవేరుతాయో? ఓ అంచనా వస్తుంది. ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగంతో నిరాశ నిస్పృహల్లో తల్లడిల్లుతున్న పసుపు వీరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కూటమి పొత్తుల్లో సీటు లభించని త్యాగశీల అభ్యర్థుల్లో కొందరిని ఎమ్మెల్సీ హోదా వరించనుంది.

వీరిలో పిఠాపురం నుంచి వర్మ, మాజీ మంత్రులు జవహర్, దేవినేని ఉమ, వంగవీటి రాధ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, నల్లపాటి రాము, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్ ఈ జాబితాలో ఉన్నారు . వైఎస్సార్సీపీ హయాంలో శాసనమండలిలో టీడీపీ స్వరం వినిపించిన మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బుద్ధావెంకన్న, అంగర రామ్మోహన్ సీనియర్ మాజీ ఎమ్మెల్సీలుగా సీటు కోసం ఎదురు చూస్తున్నారు.

చాన్స్​ ఇవ్వాలంటున్న ఆశావహులు

ఎమ్మెల్సీలుగా తమకే ఛాన్స్ ఇవ్వాలంటూ టీడీపీలో పార్టీ కోసం పని చేసిన ఆశావహులు కూడా కోరుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కీలక సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు, పీతల సుజాత ఎమ్మెల్సీ రేసులోకి వచ్చారు. యువగళం పాదయాత్రలో క్రియాశీలకంగా పనిచేసిన మద్దిపట్ల సూర్యప్రకాష్ ఈసారి అవకాశం దక్కుతుందనే ఆశతో ఉన్నారు.

తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చెంగల్రాయుడు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, నాగుల్ మీరా, మోపిదేవి వెంకట రమణారావు, విష్ణువర్థన్రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి, కలమట వెంకటరమణ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement