Monday, November 25, 2024

KNL: ఆ చిన్నారికి రూ.10లక్షలు అందజేత…

నంద్యాల : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చిన్న వంగలిలో మట్టి మిద్దె కూలి మరణించిన కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం అందజేశారు. చాగలమర్రి మండలం చిన్న వంగలిలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పరామర్శించారు. ప్రొద్దుటూరులో చదువుకుంటున్న అదే కుటుంబంలోని 2వ కుమార్తె ప్రసన్నను అక్కున చేర్చుకుని నీకు నేనొక అక్కలా ఉంటానంటూ ధైర్యమిచ్చారు ఎమ్మెల్యే.

మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలోని నలుగురు మృతిచెందిన సంఘటన తనను ఎంతో కలిచి వేసిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి అండగా ఉంటారని, 10 లక్షల రూపాయలు ఇవ్వడం, అలాగే ఆ పాప బాగోగులు చూసుకునే నాయనమ్మకు రూ.2 లక్షలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ పాప చదువు గురించి మాట్లాడడం జరిగిందని, కచ్చితంగా ఆ పాప ఎంత వరకు చదివినా ఎన్టీఆర్ స్కూల్ లోనే చదివిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

పాప చదువు బాధ్యతే కాకుండా పాప పెళ్లి అయ్యే వరకు తాను తోడుగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. అలాగే ఎక్కడైనా పాత పడిన మట్టి మిద్దెలు ఉంటే అధికారులకు తెలియజేయాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. వర్షాకాలం కనుక మట్టి మిద్దె ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చే కొత్త బిల్డింగ్స్ కు అనుమతి వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement